17-08-2025 12:36:55 AM
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం కమిటీల పేరు తో కాలయాపన చేస్తోందని తెలంగాణ ఉ ద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్యాబినెట్ సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారుల పేరుతో కమిటీలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని పేర్కొంది.
పెండింగ్ సమస్యలను ఆగ స్టు 15వ తేదీలోగా పరిష్కరించాలని ప్రభుత్వానికి గతంలో జేఏసీ విధించిన గడువు ముగిసిపోవడంతో ప్రత్యేక కార్యాచరణను ప్రకటించేందుకు జేఏసీ సిద్ధమవుతోంది. ఈనెల 19న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వానికి విన్నవించిన 63 డిమాండ్లలో ఆర్థిక భారంలేని సమస్యలను కూడా కనీసం పరిష్కరించకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైఖరిని తెలియజేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని ఈమేరకు హెచ్చరించింది. అవసరమైతే సమ్మెకు వెళ్లేందుకు వెనుకాడబోమనే ఆలోచనలో జేఏసీ నాయకులున్నారు.