02-07-2025 11:10:55 PM
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) నిర్మాణంలో వస్తున్న మరో సూపర్‌హిట్ మూవీ ‘తమ్ముడు’. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్‌వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమిగౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 4న వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్‌ను ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు ప్రొడ్యూసర్ దిల్ రాజు(Producer Dil Raju). ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
* శ్రీరామ్ వేణు మా సంస్థలో ఆర్య నుంచి పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా మాతోనే ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన మా దగ్గరనే ఉన్నాడంటే అందుకు మా మధ్య ఉన్న రిలేషన్, వేల్ వెంగ్త్ కారణం. ఇండస్ట్రీలో డబ్బుతోనే పనులు జరుగుతుంటాయి. నాది భిన్నమైన పద్ధతి. నేను వేవ్ లెంగ్త్ కలిసిన వాళ్లతోనే జర్నీ చేస్తుంటాను. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ అడ్డాల, హరీశ్‌శంకర్, వంశీ పైడిపల్లి, దశరథ్.. ఇలా డైరెక్టర్స్ మా సంస్థలో పనిచేసి హిట్ చిత్రాలు ఇచ్చారు. శ్రీరామ్ వేణు మా సంస్థలోనే ట్రావెల్ అవుతున్నాడంటే అతనికి భారీగా డబ్బు ఇవ్వడం వల్ల కాదు. మాతో ఆయనకు ఒక కంఫర్ట్ ఉంటుంది. అనిల్ రావిపూడితో నాకొక బాండింగ్ ఉంది. ఆ బాండింగ్‌లో ఒక కంఫర్ట్ ఉంటుంది. ఈ డైరెక్టర్స్ టాలెంట్ నాకు తెలుసు. కాబట్టి కథ టైమ్‌లో, ఎడిటింగ్ టేబుల్ దగ్గర నాకు అనిపించినవి అడుగుతా. నేను క్వశ్చన్ అడిగితే ఎందుకు అడిగాడు అని ఆలోచిస్తారు. అంతేకానీ వారి పనిలో ఇంటర్ ఫియర్ కాను.
* ‘తమ్ముడు’ మూవీ మొదటి 20 నిమిషాల తర్వాత మిగిలిన కథంతా ఒక్కరోజులో జరుగుతుంది. ఐదారు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిలో రెండు యాక్షన్ ఎపిసోడ్స్ వైలెంట్‌గా ఉన్నాయని ఎ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ వాళ్లు చెప్పారు. ఆ రెండు ఎపిసోడ్స్ తీసేస్తే యూ/ఏ ఇస్తామని చెప్పారు. ఈ సినిమాను థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసమే చేశాం కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్సులు తీసేయకుండా ఎ సర్టిఫికెట్‌కు అంగీకరించాం. ఇది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి ఎంటర్ టైనర్ అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ రండి అని చెబుతాం. ‘తమ్ముడు’ యాక్షన్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్న చిత్రం. థియేటర్స్‌కు వచ్చిన వాళ్లనైనా సంతృప్తి పరచాలి కదా అని ఎ సర్టిఫికెట్ తీసుకున్నాం. ఈ చిత్రాన్ని 150 రోజులు చిత్రీకరించారు. 80 పర్సెంట్ మూవీ అడవిలో ఉంటుంది. విజువల్స్, సౌండింగ్ హై క్వాలిటీతో ఉంటూ థియేటర్‌లో ఎంజాయ్ చేసేలా రూపొందించారు దర్శకుడు.
* పైరసీ అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తోంది. థియేటర్లలో కూర్చుని సినిమా రికార్డ్ చేస్తున్న నలుగురిని ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా రికార్డ్ చేసిన సినిమాలను చిన్న సినిమాకు 400 డాలర్స్, పెద్ద సినిమాకు వెయ్యి డాలర్స్ చొప్పున అమ్ముతున్నారు. వాళ్లకు అదే పెద్ద అమౌంట్ కానీ, నిర్మాతలు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. పైరసీని అరికట్టే చర్యలు క్రమంగా కట్టుదిట్టం అవుతాయని ఆశిస్తున్నాం.
* ‘తమ్ముడు’ సినిమాకు ప్రీమియర్స్ వేసే విషయం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రీమియర్స్ కోసం ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఒక హోదాలో ఉన్నాను కాబట్టి అన్నీ చూసుకుని చేయాలి. తమ్ముడు మూవీని నెట్ ఫ్లిక్స్ వాళ్లు చూసి నచ్చి తీసుకున్నారు.
- పైరసీ అయినా, ఈ నెగిటివ్ ప్రచారాన్ని అయినా క్రమంగా ఒక్కో స్టెప్‌తో ఎదుర్కొంటూ వెళ్లాల్సిందే. ఎవరైనా రివ్యూస్ రాసేప్పుడు నిర్మాత గురించి ఒక్క నిమిషం ఆలోచించాలి. హీరో, డైరెక్టర్‌కు కూడా ఎఫెక్ట్ అయినా, ఎక్కువ నష్టం జరిగేది ప్రొడ్యూసర్‌కే. నేను వీటిపైన గట్టిగా మాట్లాడితే దిల్ రాజుకు ఆటిట్యూడ్ వచ్చింది అంటారు. నితిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తన గుడ్ బ్యాడ్ ఏంటో చెప్పండి అని అడిగితే నేను అల్లు అర్జున్ కంటే నువ్వు ముందు కెరీర్ స్టార్ట్ చేశావ్.. ఆయన రేంజ్‌కు వెళ్లలేకపోయావ్ అని ఒక వెల్ విషర్‌గా చెప్పాను. మా మధ్య ఉన్న రిలేషన్‌తోనే అలా చెప్పాను. దాన్ని నెగిటివ్‌గా చూడొద్దు.
* ‘తమ్ముడు’ మూవీకి అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు. మనమంతా కొత్త సినిమా కావాలనుకుంటాం. శ్రీరామ్ కూడా కొత్తగా ప్రయత్నిస్తా అన్నాడు. మేము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేయించాం. శుక్రవారం మార్నింగ్ షో చూసిన అందరికీ మా సినిమా నచ్చితే సూపర్ హిట్ దక్కినట్లే. కథగా చూస్తే ఇది సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారనేది మూవీలో చూస్తారు. ఈ కథను స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్‌తో వెళ్తూ ఆసక్తికరంగా దర్శకుడు తెరకెక్కించారు.
* నిర్మాతగా సినిమాను బాగా రెడీ చేసి ప్రాపర్‌గా రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. వారికి నచ్చితే సూపర్ హిట్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు డైరెక్టర్ అనిల్ బాగా ప్లాన్ చేసి ప్రేక్షకులకు మూవీ రీచ్ అయ్యేలా చేశాడు. ఆ సినిమా మేము అనుకున్నదానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. ‘తమ్ముడు’ రిజల్ట్ మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అయితే ఎంత రేంజ్ హిట్ అవుతుందనేది మాత్రం రిలీజ్ రోజునే తెలుస్తుంది.
* ఫలానా ఓటీటీ సినిమాను తీసుకుందని ముందే ప్రకటించడం ఆపేస్తే మంచిది. ఓటీటీలు కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నాయి. తమ్ముడు మూవీ కంటెంట్‌కు వస్తున్న వ్యూస్ విషయంలో జెన్యూన్‌గా ఉంటున్నాం.
* ప్రతిభ గల కొత్త వాళ్లకు అన్ని విభాగాల్లో అవకాశాలు ఇవ్వాలనే ‘దిల్ రాజు డ్రీమ్స్’ స్టార్ట్ చేశాం. మొదటి రోజునే మాకు 12 వేల అప్లికేషన్స్ వచ్చాయి. అందులో స్క్రూటినీ చేసి 1400 అప్లికేషన్స్ తీసుకున్నాం. ప్రొడ్యూసర్‌గా 81 అప్లికేషన్స్ వస్తే వాటిలో వాళ్ల కంపెనీ హిస్టరీ ఏంటి అని డీటెయిల్స్ చూసి 7 అప్లికేషన్స్ తీసుకున్నాం. ఇందులో రెండు మోడల్స్ చేస్తున్నాం. ఒకటి కథ బాగుంటే మేమే ఫండింగ్ చేసి వాళ్లతో మూవీ చేయిస్తాం. రెండోది వాళ్లే సినిమా చేసుకుని మా ప్రెజెన్స్, మా గైడెన్స్‌లో రిలీజ్ చేస్తాం. ఈ క్రమంలో కొత్త నిర్మాతలు కూడా ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తున్నాం.
* ఎఫ్‌డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ చేశాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలనుకుంటున్నాం. ఆన్‌లైన్ టికెటింగ్, రన్‌ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
* ప్రస్తుతం మా సంస్థలో ‘రౌడీ జనార్థన’, ‘ఎల్లమ్మ’, ‘దేత్తడి’ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. మరో ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ ఏడాది చేస్తున్న నాలుగు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్‌కు తీసుకొస్తాం. వచ్చే ఏడాదిలో చేయాల్సిన ఐదారు మూవీస్ స్క్రిప్ట్ నెరేషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అవి 2026లో స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఎస్వీసీ, దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో రాబోతున్న కొత్త మూవీస్. నెక్ట్స్ ఇయర్ వచ్చే సినిమాల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఒకటి, మార్కో మూవీ డైరెక్టర్ హనీఫ్‌తో ఒక సినిమా ఉంటాయి. అలాగే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు లాక్ చేశాం. ‘యానిమల్’లాగా ఒక సినిమా ఉంటుంది. అందులో నటించే స్టార్ హీరో కోసం చూస్తున్నాం. ఇవి కాకుండా ‘దిల్ రాజు డ్రీమ్స్’లో రెండు మూడు చిత్రాలు లైనప్‌లో ఉన్నాయి. ఎలాంటి కంటెంట్‌తో సినిమాలు తీస్తే ఆడియెన్స్ థియేటర్స్‌కు వస్తారనేది డిస్కస్ చేస్తున్నాం.