calender_icon.png 24 August, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిరంజీవి నన్ను తిట్టినా పర్వాలేదు నిర్మాత నట్టి కుమార్

24-08-2025 01:27:14 AM

‘చిన్న నిర్మాతలకు, కార్మిక సంఘాలకు అనేక సందేహాలున్నాయి. నివృత్తి చేయాల్సినవారు కనిపించడంలేదు. చర్చల్లో పాల్గొన్న ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఫెడరేషన్ బాధ్యలు అందుబాటులోకి రావడంలేదు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన చిరంజీవిని చర్చల కమిటీ మర్చిపోవడం కృతజ్ఞత అనిపించుకోదు. పార్టీల రాజకీయం కన్నా పరిశ్రమలోనే రాజకీయాలు ఎక్కువగా ఉంటాయని అర్థమవుతోంది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు సీనియర్ నిర్మాత నట్టి కుమార్.

శనివారం ఆయన మరో నిర్మాత సదానంద్‌గౌడ్‌తో కలిసి హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ.. “తెలుగు సినీ పరిశ్రమలో 18 రోజుల సమ్మెకు ముగింపు పలకడం సంతోషకరం. కానీ మా చిన్న నిర్మాతలకు, వివిధ సంఘాలకు చెందిన కార్మికులకు అనేక సందేహాలున్నాయి. వాటిని తీర్చేందుకు చర్చల్లో పాల్గొన్న  ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ, అటు ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కానీ ఎవరూ కనిపించడం లేదు.

షూటింగులు నిలిచిపోవడంతో ఈ సమస్యను పరిష్కరించమని  సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు మా చిన్న నిర్మాతలతోపాటు పెద్ద నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులందరూ వేర్వేరుగా వెళ్లి కలిశారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, సమస్య పరిష్కారానికి పూనుకోవడం సంతోషదాయకం. అయితే లేబర్ కమిషన్ దగ్గర ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఫెడరేషన్ నాయకుల మధ్య కుదిరిన ఒప్పందంలో కొన్ని అంశాలు మాకు అంగీకారం కాదని సినీ కార్మికులు అంటున్నారు.

ఫెడరేషన్ నాయకులు మాకు చెప్పకుండా, మా ప్రమేయం లేకుండా సంతకాలు పెట్టడం అభ్యంతరకరమని విమర్శిస్తున్నారు. షూటింగులు ఇంకా మొదలు కాలేదు.. సమస్య పరిష్కారానికి మూడు రోజుల సమయం వెచ్చించి అందరి సమస్యలను విని, సమ్మె విరమణ దిశగా మార్గం సుగమం చేసిన చిరంజీవికి ఛాంబర్ నాయకులు కానీ, ఫెడరేషన్ నాయకులు కానీ కనీస కృతజ్ఞతలు చెప్పకపోవడం నాకు చాలా బాధాకరమనిపించింది.

మరచిపోవడం కరెక్ట్ కాదు.  ఈ అంశంలో చిరంజీవి నన్ను తిట్టినా సరే నా అభిప్రాయం సూటిగా చెబుతున్నా. సినీ పరిశ్రమలో కూడా ఎక్కువ రాజకీయాలు ఉంటాయని అర్థమవుతోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో చిన్న సినిమాలకు 5వ ఆట (మధ్యాహ్నం 2.30 గంటల షో)ను శాశ్వతంగా కేటాయించాలి. మల్టీఫ్లెక్స్‌లలో 20 శాతం సీట్లకు టికెట్ ధర రూ.100గా నిర్ణయించాలి. చిన్న సినిమాల వల్ల పరిశ్రమలో కార్మికులకు ఎప్పుడూ పని దొరుకుతూనే ఉంటుంది. అందుకే చిన్న సినిమాను బతికించాలి” అన్నారు.