calender_icon.png 14 October, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధ దంపతుల హత్యకేసులో పురోగతి

14-10-2025 12:18:02 AM

నిందితుడు అరెస్టు, బంగారం, నగదు, మత్తు మాత్రలు, మొబైల్ ఫోన్ స్వాధీనం

కరీంనగర్ క్రైం, అక్టోబర్13(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా, గంగాధర పోలీసు స్టేషన్ పరిధిలోని గర్షకుర్తి గ్రామంలో ఇటీవల జరిగిన వృద్ధ దంపతులపై హత్యాయత్నం, హత్య కేసులో గంగాధర పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కత్తి శివ (37) ను అరెస్టు చేసి, అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలు , నేరానికి ఉపయోగించిన మత్తు మాత్రలను, సెల్ పోన్ ను  స్వాధీనం చేసుకున్నారు. గర్షకుర్తి గ్రామానికి చెందిన గజ్జల శంకరయ్య (76), అతని భార్య గజ్జల లక్ష్మి (70) ఇంటికి సమీపంలో ఉండే నింది తుడు కత్తి శివ  అప్పుడప్పుడు వారికి బయట నుండి మందులు, అవసరము ఉండే ఇంటి సామా నులు తెచ్చి ఇచ్చి సహాయపడేవాడు.

శివ ఈ మద్య ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు, పేకాట లాంటి వాటికి అలవాటు పడి, అప్పులు ఎక్కువ అయి, ఖర్చులు, జల్సాల నిమిత్తం డబ్బులు అవసరము అయి, గజ్జల శంకరయ్య మరియు లక్ష్మి లను చంపి, లక్ష్మీ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించాలని పథకం వేశాడు. కానీ వారిని డైరెక్ట్ గా హత్య చేస్తే దొరికిపోయి తనకు శిక్ష పడుతుందని, వారికి తెలియకుండా, వృద్దులు వాళ్ళకే ఏదో అనారోగ్యం వచ్చి చనిపోయారు అని క్రియేట్, చేసి, వాళ్ళు చనిపోయిన తరువాత బంగారం దొంగతనం చేయాలన్న ఉద్దేశ్యముతో, ప్లాన్ ప్రకారం తాను గతంలో ముంబైలో కల్లు దుకాణంలో పని చేస్తున్నప్పుడు, కల్లు దుకాణము యజమాని మత్తు కోసం కల్లులో కలిపే టాబ్లెట్లు ఎవరికి తెలియకుండా దాచుకుని, ప్లాన్ ప్రకారం తేదీ అక్టోబర్ 7, ఉదయం 08:30 గంటల సమయంలో, శంకరయ్య, లక్ష్మిలకు జ్వరం, జలుబు , దగ్గు మరియు ఒళ్లు నొప్పులు  ఉన్నాయని తెలుసుకొని,  వారి ఇంటికి తన దగ్గరున్న మత్తు మాత్రలు ఆ వృద్దుల వద్దకు తీసుకపోయి, ఇవి వేసుకుంటే మీ  జ్వరం, జలుబు , దగ్గు ఒళ్లు నొప్పులు వెంటనే తగ్గుతాయని నమ్మించి,  అ ఇద్దరు వృద్దులు ఒక్కొక్కరు ఆరు మాత్రలు చొప్పున మింగేలా చేశాడు.

అవి మింగిన సుమారు రెండు గంటల తరువాత ఆ ఇద్దరు వృద్దులు మత్తులోకి అపస్మారక స్తితిలోకి వెళ్లిన తర్వాత, నిందితుడు వారి ఇంటికి వెళ్ళి, లక్ష్మి మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించి పరారయ్యాడు. అనంతరం అదే రోజు గ్రామంలోని కట్ల శ్రీనివాసాచారి అనే గోల్డ్ స్మిత్ వద్ద ఆ బంగారాన్ని అమ్మి రూ.1,85,000/- నగదు తీసుకున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఆ బంగారం కొన్నటువంటి శ్రీనివాసాచారి వద్ద గతములో కత్తి శివ తన బార్య బంగారు నగలు అమ్మయినందున, అతను నమ్మి, ఆ బంగారం కొని, శివకు డబ్బులు ఇవ్వడం జరిగినది.

బంగారం వ్యాపారి ఇచ్చిన డబ్బులు శివ తన అప్పులు తీర్చుకోవడం, పేకాట, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కోసం ఆ డబ్బును ఖర్చు చేసినట్లు తెలిపాడు.  అపస్మారక స్థితిలో ఉన్న వృద్దులు శంకరయ్య , లక్ష్మిని సాయంత్రం ఆసుపత్రికి తరలించగా, అక్టోబర్ 08 న మధ్యాహ్నం శంకరయ్య చికిత్స పొందుతూ మరణించాడు. వృద్దురాలు లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నది.ఏ.సి.పి రూరల్ విజయ కుమార్ ఆద్వర్యంలో,  ఇన్స్ పెక్టర్ ప్రదీప్ కుమార్, వంశీకృష్ణ, ఎస్.ఐ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ లు జంపన్న  అరవింద్‌లను కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్  అభినందించినారు.