01-09-2025 01:01:22 AM
శాంతినగర్ పీఎస్‌కు తరలింపు
అలంపూర్, ఆగస్టు31:గద్వాల జిల్లా పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్తులు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి జైలుకు వెళ్లి వచ్చిన సంగతి విధితమే.
ఈ క్రమంలో గ్రామస్తులను,రైతులను పరామర్శించి పరిస్థితులను తెలుసుకునేందుకు పెద్ద ధన్వాడ వెళ్తున్న ప్రజా సంఘాల నేతలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.ఆదివారం రోజున బాధిత గ్రామాల రైతులను కలిసేందుకు వెళ్తున్న టిపి జాక్ కన్వీనర్ కన్నెగంటి రవి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వామిదాసు, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ఆలిండియా కన్వీనర్ బండారి లక్ష్మయ్యలను పోలీసులు అరెస్టు చేశారు.
వారిని పెద్దధన్వాడకు వెళ్లకుండా అదుపులోకి తీసుకుని శాంతినగర్ పీఎస్కు తరలించారు. ఈ సందర్భంగా పెద్దధన్వాడ ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ తీవ్రంగా స్పందించింది.మూడు రోజుల క్రితం రాజకీయ నాయకులొస్తే పోలీసులు భారీ బందోబస్తు కల్పించారని, ప్రజలను కలిసేందుకు వస్తున్న ప్రజాసంఘాల నాయకులను అరెస్టు ఎంతవరకు సమంజసమన్నారు. బాధిత ప్రజలను పరామర్శించేందుకు రావడం కూడా తప్పేనా.. ఇదేం న్యాయమని ప్రశ్నించింది. ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు ఉద్యమం ఆగదని సందర్భంగా హెచ్చరించారు.