09-05-2025 12:32:47 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, మే 8(విజయక్రాంతి): రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని ఇటిక్యాల, కొత్తూరు, నెల్కివెంకటా పూర్, మోదెల, చందారం, దౌడెపల్లి, పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం, గంపలపల్లి, తిమ్మాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించా రు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. సన్నరకం వడ్లకు మద్దతు ధరతో పాటు రూ. 500 అదనపు బోనస్ అందించడం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యాలు కల్పించడంతోపాటు గోనె సం చులు, టార్పాలిన్లను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు.
కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు రశీదు జారీ చేయాలని, రైతులు, ధాన్యం వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు ఆటోమెటిక్ యంత్రంతో శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాల వద్దకు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకురావాలని, అకాల వర్షాల సమయంలో కేంద్రాలలో అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించు కోవాలని కోరారు.
ధాన్యం కొలతలు పరీక్షించి గ్రేడ్ ఎ, సాధారణ రకాలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రా లలో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొం దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.