09-08-2025 12:42:26 AM
మహబూబాబాద్, ఆగస్టు 8 (విజయ క్రాంతి): కాజీపేట -విజయవాడ రైల్వే మార్గంలో గత ఏడాది సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ తెగిపోయిన ఘటనల నేపథ్యంలో ఈసారి ముందస్తుగా రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. గత ఏడాది సెప్టెంబర్ 1న భారీ వర్షాలు కురవడంతో మహబూబాబాద్ జిల్లాలో కేసముద్రం - ఇంటి కన్నే, తాళ్లపూస పల్లి మహబూబాబాద్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ కింద మట్టి పూర్తిగా కొట్టుకుపోయి రెండు రోజులపాటు రైళ్ల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.
రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో పాటు వరదలతో రైల్వే ట్రాక్ దెబ్బతిని రైల్వే శాఖకు భారీగా నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండడంతో పాటు ప్రమాద స్థాయిని ముందుగానే గుర్తించేందుకు ప్రమాద ఘటనలకు అవకాశం ఉన్నచోట రైల్వే శాఖ ముందస్తుగా తగిన రక్షణ ఏర్పాట్లను చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో రైల్వే ట్రాక్ వరదలకు దెబ్బతిన్న ప్రాంతంలో రాత్రి పూట గస్తీ నిర్వహించడానికి సిబ్బందిని నియమించడంతోపాటు, వారికి ఎండా, వాన నుండి రక్షణ కల్పించడానికి ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ వెంట ప్రత్యేకంగా ‘హాట్ ’ ఏర్పాటు చేశారు.
గత ఏడాది భారీ వర్షాలకు ముందే రైల్వే ట్రాక్ వెంట ఉన్న కల్వర్టుల వద్ద గస్తీ ఏర్పాటు చేయగా, ప్రమాద ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బంది ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా రైల్వే శాఖ ఆయాచోట్ల సిబ్బందితో రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించడంతోపాటు ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షించి ఉన్నతాధికారులకు తెలియజేసే విధంగా చర్యలు చేపట్టారు.