calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ సమక్షంలో జీపీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్

04-12-2025 12:58:34 AM

నారాయణపేట, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా  పోలింగ్ సిబ్బంది రెండవ  విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, సాధారణ పరిశీలకురాలు (ఎన్నికలు) సీతా లక్ష్మీ సమక్షంలో బుధవారం  నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో  ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ జరిపించారు.

ఈ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. జిల్లాలోని  ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, ఓ.పీ.ఓ లను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. స్థానికత, విధులు నిర్వర్తిస్తున్న మండలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ర్యాండమైజేషన్ ద్వారా స్థానికేతర సిబ్బందిని పోలింగ్ విధుల కోసం ఎంపిక చేశారు. 

జిల్లాలోని 67 గ్రామ పంచాయతీల సర్పంచ్, 572 వార్డుల స్థానాలకు, 572 పోలింగ్ స్టేషన్ లలో ఎన్నికల నిర్వహణ కోసం 20 శాతం రిజర్వ్ స్టాఫ్ కలుపుకుని ప్రిసైడింగ్ అధికారులతో పాటు, ఓ.పీ.ఓల ర్యాండమైజేషన్ జరిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్,  డీపీఓ సుధాకర్ రెడ్డి, డీపీ ఆర్ ఓ రషీద్  పాల్గొన్నారు.