30-01-2026 12:00:00 AM
వడోదర, జనవరి 29 : వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్ లో యూపీ వారియర్స్ ను చిత్తు చేసి టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన యూపీ వారియర్స్ మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు దీప్తి శర్మ , మెగ్ లానింగ్ 8.1 ఓవర్లలోనే తొలి వికెట్ కు 74 పరుగులు జోడించారు. ఈ క్రమం లో దీప్తి శర్మ హాఫ్ సెంచరీ (55) పూర్తి చేసుకోగా.. వెంటనే మెగ్ లానింగ్ (43) కూడా ఔటవడంతో ఒక్కసారిగా యూపీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. మిగిలిన వారిలో ఎవ్వరూ కూడా క్రీజులో నిలవలేకపోయారు.
20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. డిక్లార్క్ 4 వికెట్లతో యూపీని దెబ్బతీయగా.. ఆల్ రౌండర్ గ్రేస్ హ్యారిస్ 2 వికెట్లు పడగొట్టింది. అనుకున్న దాని కంటే తక్కువ స్కోరుకే ప్రత్యర్థిని కట్టడి చేయడంతో ఆర్సీబీ ఫుల్ జోష్ తో బ్యాటింగ్ ఆరంభించింది. ఓపెనర్లు ఇచ్చిన ఆరంభంతో తొలి వికెట్ కు కేవలం 9.1 ఓవర్లలో 108 పరుగులు చేసింది. హ్యారిస్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం 37 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు చేసింది. ఆమె ఔటైన తర్వాత స్మతి మంధాన దూకుడుగా ఆడి మ్యాచ్ ను ముగించింది.