calender_icon.png 9 December, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొట్టిపోరుకు రెడీ

08-12-2025 12:27:58 AM

-మిషన్ వరల్డ్‌కప్‌లో మరో సిరీస్

-తుది జట్టు కూర్పే సవాల్

-దూబే, సుందర్‌లో ఒకరికే ఛాన్స్

కటక్, డిసెంబర్ 7: సౌతాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా తర్వాత వన్డే సిరీస్ విజయంతో రివేంజ్ తీర్చుకుంది. ఇప్పుడు షార్ట్ ఫార్మాట్‌లో సైతం సఫారీలను చిత్తు చేసే లక్ష్యంతో ముమ్మరంగా సాధన చేస్తోంది.

మంగళవారం కటక్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి టీ ట్వంటీ జరగబోతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఫైనల్ కాంబినేషన్‌ను సెట్ చేసుకునే పనిలో ఉంది.

మెగా టోర్నీకి ముందు భారత్ ఇంకా 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఈ సిరీస్‌లో జరిగే ఐదు మ్యాచ్‌లతో వచ్చే ప్రపంచకప్‌కు జట్టు దాదాపుగా ఖరారు చేసుకోవాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. ఇప్పటికే 10 మంది పేర్లు ఖరారైనట్టే.. మిగిలిన ఐదు స్థానాల కోసం కనీసం 10 మంది రేసులో నిలిచారు. తమ సత్తా నిరూపించుకునేందుకు వారికి ఈ సిరీసే కీలకం కాబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే చివరి అవకాశం. 

ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌కు ఎంపిక చేయబోయే జట్టే టీ20 ప్రపం చకప్‌లోనూ ఆడుతుందని చెప్పొచ్చు. దీంతో మెగాటోర్నీ కోసం ఎంపికయ్యే జట్టులో చోటు ఆశిస్తున్న ప్లేయర్స్‌కు ఇది లాస్ట్ ఛాన్స్. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్ విన్నర్లుగా నిలిచే ఆల్‌రౌండర్ల కోటాలో చాలా మంది రేసులో ఉన్నారు.

సౌతాఫ్రికాతో జరిగే తొలి టీ ట్వంటీ కోసం తుది జట్టు కూర్పే సవాల్‌గా మారింది. బ్యాట ర్ల విషయంలో కాకున్నా ఆల్‌రౌండర్ల ఎంపికపై కోచ్ గంభీర్ తర్జన భర్జన పడుతున్నాడు. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌లో ఎవరికి చోటు దక్కనుందో చూడాలి. కటక్‌లో రెడ్ సాయిల్ పిచ్ సిద్ధం చేస్తుండడంతో స్పిన్నర్లతో పోలిస్తే పేసర్లకే అడ్వాంటేజ్ ఉంటుంది.

దీని ప్రకారం చూస్తే దూబేకు అవకాశం దక్కొచ్చు. తుది జట్టులోకి హార్థిక్ పాండ్యా ఎంట్రీతో బ్యాటింగ్ డెప్త్ మరింత పెరిగింది. రీఎంట్రీలో హర్థిక్ కూడా రాణించాడు. ఫిట్‌నెస్ సమస్యలు లేవని నిరూపించుకునేందుకు కూడా ఈ సిరీస్ గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పొచ్చు. అలాగే బ్యాటింగ్‌లో గిల్ కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఫిట్‌నెస్ సాధించినట్టు కోచ్ గంభీర్ క్లారిటీ ఇవ్వడంతో అభిషేక్ శర్మ, గిల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. దీంతో సంజూ శాంసన్ మిడిలార్డర్‌లోనే ఆడాల్సి ఉంటుంది.

సూర్యకుమార్ యాదవ్ వన్‌డౌన్‌లోనూ, తిలక్ వర్మ నాలుగో స్థానంలోనూ బ్యాటింగ్ చేస్తారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా బరిలోకి దిగుతాడు. ఇదిలా ఉంటే పేస్ విభాగంలో వన్డే సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా కీలకం కాబోతున్నాడు.

అలాగే టీ20ల్లో బెస్ట్ బౌలర్‌గా పేరున్న అర్షదీప్‌సింగ్, మరో పేసర్ హర్షిత్ రాణాకు చోటు ఖాయం. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే వన్డేల్లో హిట్టింగ్ మోడ్‌లోనే ఆడిన సౌతాఫ్రికాను కట్టడి చేయాలంటే భారత బౌలర్లకు సవాలే. 

భారత తుది జట్టు (అంచనా) : అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్/శివమ్ దూబే, కుల్దీప్, హర్షిత్ రాణా, బుమ్రా, అర్షదీప్ టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్ ముగిసాయి.. భారత్, సౌతాఫ్రికా మధ్య ఇక ధనాధన్ క్రికెట్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది.

మంగళవారం నుంచి ఐదు టీ20ల సిరీస్‌కు తెరలేవబోతోంది. రెడ్ బాల్ క్రికెట్‌లో సఫారీలు వైట్‌వాష్ చేస్తే.. వన్డే సిరీస్‌లో భారత్ పైచేయి సాధించింది. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపేందుకు ఇరు జట్లు రెడీ అవుతున్నాయి. మిషన్ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇక రెండే సిరీస్‌లు మిగిలి ఉండడంతో జట్టు కూర్పుపై టీమిండియా ఫోకస్ పెట్టింది.