calender_icon.png 2 May, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మెపై చర్చలకు సిద్ధం

02-05-2025 01:53:21 AM

ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): నోటీసులు ఇచ్చినప్పటికీ సమ్మె చేపట్టేందుకు ఇంకా ఆరు రోజుల గడువు ఉందని, ఈలోగా ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, నాయకులు స్పష్టం చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులు చేపట్టబోయే సమ్మె పట్ల స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

ఆర్టీసీలో సంఘాలు ఉండాలని, ఆ సంఘాలతో కార్మికులకు ఏమైనా సమస్యలు ఎదురైతే సామరస్యంగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుందని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు గుర్తు చేశారు. గత ఏడు నెలలుగా పలుమార్లు రవాణా శాఖ మంత్రి, ఆర్థికమంత్రి, ప్రభుత్వ పెద్దలందరినీ కలిసి వినతి పత్రాలు అందించినప్పటికీ, సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల సమ్మె నోటీసు ఇవ్వాల్సి వచ్చినట్టు వివరించారు.

తమ సమ్మె డిమాండ్లలో ఆర్థిక అంశాలు లేని సమస్యలే 90 శాతం ఉన్నాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని తమతో చర్చించాలని కోరారు. అధికారులు తప్పుడు నివేదికల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డికి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని ఆరోపించారు. అందుకే వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వాలని కోరారు. రాజకీయ పార్టీలు ఉసిగొలిపితే తాము ఉద్యమాలు చేస్తున్నమని సీఎం వ్యాఖ్యానించడం బాధించిందని వాపోయారు.

ఆర్టీసీ కార్మికులు నిత్యం అనుభవిస్తున్న ఇబ్బందులను, డిపోలలో అధికారులు చేస్తున్న వేధింపులు, అధిక పని భారాలు మోయలేక అనారోగ్యాలతో కార్మికులు చనిపోతున్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని సమ్మెకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టీసీలోని అనేక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు.