calender_icon.png 30 October, 2025 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షణాలు గుర్తించండి.. స్ట్రోక్‌ను ఆపండి

29-10-2025 01:32:21 AM

డాక్టర్ నిహారిక, న్యూరాలజిస్టు, స్టార్ హాస్పిటల్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అక్టోబర్ 29న జరుపుకునే వరల్ స్ట్రోక్ డే ఈ ప్రాణాంతకమైనదే.. కానీ నివారించగల వ్యాధి అని, లక్షణాలు గుర్తిం చి, స్ట్రోక్‌ను ఆపవచ్చు అని డాక్టర్ నిహారిక మతుకుమల్లి, సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్ అన్నారు. ఆమె మాట్లాడుతూ.. “భారతదేశంలో 2024 గణాంకాల ప్రకారం ఏటా 18 లక్షలకుపైగా కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి.

స్ట్రోక్ మరణాలకు నాలుగవ ప్రధాన కారణంగా, వికలాంగతకు ఐదవ ప్రధాన కారణంగా ఉంది. హై బ్లడ్ ప్రెజర్, షుగర్, పొగ త్రాగడం, వ్యాయామం లోపం వంటి కారణాలే దీనికి దారితీస్తున్నాయి. ముఖ్యంగా, ఇప్పుడు యువతలో కూడా స్ట్రోక్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర విషయం. చాలామందికి స్ట్రోక్ అంటే హార్ట్ అటాక్ లాంటి దేనని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి స్ట్రోక్ హృదయాన్ని కాదు, మెదడును ప్రభావితం చేసే దాడి.

మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల ఇది జరుగుతుంది. స్ట్రోక్ సమయంలో ప్రతి సెకనూ విలువైనది. ఒక సెకనులోనే లక్షల మెదడు కణాలు నశిస్తాయి. కాబట్టి త్వరగా స్పందించడం అత్యవసరం. ముఖం ఒక వైపు వంగి ఉన్నా, చేతుల్లో ఒకటి కిందికి జారుతున్నా, మాటలు స్ప ష్టంగా రాకున్నా వెంటనే వైద్య సహాయం పొందండి. అకస్మాత్తుగా చూపు పోవడం, ద్వంద్వ దర్శనం, శరీరం ఒకవైపు నిస్సత్తువ, లేదా తీవ్రమైన తలనొప్పి ఉన్నా ఆస్పత్రికి వెళ్ళడం వల్ల మెదడు నష్టం తగ్గించవచ్చు.

గత రెండు దశాబ్దాల్లో 20 నుండి 64 ఏళ్ల వయస్సు గల వయోజనుల్లో 25% వరకు కేసులు పెరిగాయి. హై బీపీ, కొలెస్ట్రాల్, షుగర్, హృదయ సంబంధ గందర గోళాలు, ధూమపానం  ఇవన్నీ ప్రధాన ప్రమాద కారకాలు. వీటిని నియంత్రించడం, వ్యాయామం, సరైన ఆహారం, మరియు ఒత్తిడి నియంత్రణ ద్వారా స్ట్రోక్‌ను నివారించవచ్చు” అని చెప్పారు. స్టార్ హాస్పిటల్లో న్యూరాలజీ నిపుణులు, ఎమర్జెన్సీ టీమ్, రిహాబిలిటేషన్ నిపుణులు కలిసి 24 గంటలకు అత్యవసర సేవలు అందిస్తున్నారు.