calender_icon.png 21 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులు ట్యాంపరింగ్..?

20-08-2025 10:58:42 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి):  మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో కొందరు స్వార్ధపూరితంగా చేతివాటం ప్రదర్శిస్తూ రికార్డులో ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు తెలుస్తుంది. మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పహార్ ఇదే విషయంపై చర్చించి అధికారులు, సిబ్బందితో చర్చించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై డిప్యూటీ తహసిల్దార్, కిందిస్థాయి సిబ్బందికి మెమో ఇచ్చారనే విషయం వినిపిస్తోంది.

ఈ విషయంలో కార్యాలయంలోని కొందరి పాత్ర ఉంది కాబట్టే అధికారులు అసలు విషయం బయటికి పొక్కకుండ ఉంచినట్లు పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని కల్మల చెరువు సమీపంలోని ఓ తండాకు సంబంధించిన భూమి విషయమై రికార్డులో ఉన్న పేరును టాంపర్ చేసి ఆ స్థానంలో మరో పేరును నమోదు చేసినట్లు తెలిసింది.  అయితే వీరు ఇరువురు ఓకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ వారి మధ్య వివాదం తలెత్తడంతో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా భూములకు రేట్లు పెరగడం పలితంగా స్వార్థపూరిత ఆలోచనతో అధికారులకు ఆశజూపి వారు ఇటువంటి చర్యలకు పాల్పడినట్లు వినికిడి. కొందరు అధికారులు చేస్తున్న తప్పిదాల ఫలితంగా అనేకమంది ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇదే నిజమైతే ఇటువంటి చర్యకు పాల్పడ్డ వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇంత జరిగినా కార్యాలయ సిబ్బంది మాత్రం ఏమీ జరగనట్టు వివరిస్తుండడం గమనార్హం.