30-09-2025 01:44:14 AM
ములకలపల్లి, సెప్టెంబర్ 29,(విజయక్రాంతి): సిఐటియు నిర్వహించిన పోరాటాల ఫలితంగానే గ్రామ పంచాయతీ కార్మికుల రెండు నెలల పెండింగ్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు చిక్కుల శ్రీను తెలియజేశారు. సోమవారం మండల కేంద్రములో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామ పంచాయతీ కార్మికులు పండగ పూట పస్తులు ఉండాలా? అని ప్రశ్నిస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముందు నిర్వహించిన పోరాటాల ఫలితంగా నేడు గ్రామ పంచాయతీ కార్మికులకు రెండు నెలల పెండింగ్ వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. వేతనాలు పెండింగ్ లేకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమా 20 లక్షల రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాపోతే భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి గంటా శ్రీనివాసరావు, కోశాధికారి వర్క రుక్మధరావు, మేకల రమేష్, కమ్మంపాటి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.