30-09-2025 01:44:14 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాం తి): ‘ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది..అందులో భాగంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ జారీ చేసింది.. ఇలాంటి తరుణంలో బీసీల నోటికాడి ముద్దను లాక్కోవద్దు.. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన వారు కేసులను ఉపసంహరించుకోవాలి’ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభా కర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మీడి యాతో మాట్లాడారు.
అసెంబ్లీలో ఆమోదం తెలిపినట్లుగానే వచ్చే నెల 8న తేదీన హైకోర్టు లో జరిగే విచారణలో కూడా అన్ని పార్టీలు బీసీ బిల్లు ఆమోదమేనని సుమోటోగా అఫిడవిట్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ,తెలంగాణ జనసమితి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కకృష్ణ మాదిగతో పాటు అన్ని పార్టీలు, కుల సంఘాలన్నీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని, 42శాతం రిజర్వేషన్లు కొనసా గించాలని చీఫ్ జస్టిస్ బెంచ్‌కి తెలపాలని విజ్ఞప్తి చేశారు.
తనతో పాటు మంత్రులు కొండా సురేఖ, వాటికి శ్రీహరి, పార్టీకి చెందిన సీనియ ర్ నాయకులందరం రాజకీయ పార్టీల నాయకులను కలుస్తామన్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలు, ఆదేశాల మేరకు సీఎం రిజర్వేషన్లకు 50శాతం పరిమితిని ఎత్తివే స్తూ బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. తమిళనాడులో షెడ్యూల్ 9లో పొందు పరిచిన 69శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం కూడా కులగణనకు అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించేలా చూడాలన్నారు. బీసీ రిజర్వేషన్లతో దసరా కంటే ముం దే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆయా పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు నేతల మెప్పు కోసం మాట్లాడి సమాజంలో తలవంపులు తెచ్చుకోవద్దన్నారు. రిజర్వేషన్లు అమలు కాకపోతే బీసీ బిడ్డలు ఇంకా వెనకబడిపోతారన్నారు.