calender_icon.png 17 July, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి రైతుకు ఊరట..!

17-06-2025 12:03:10 AM

  1. మద్దతు ధర క్వింటాలుకు రూ.589 పెంచిన కేంద్రం
  2. వరికి తక్కువగా రూ.69 పెంపు
  3. జిల్లాలో పత్తి సాగు 3.80 లక్షల ఎకరాలు
  4. ధర పెంపుతో సాగు విస్తీర్ణం పెరిగేనా ?
  5. నిరాశలో వరి రైతులు

సంగారెడ్డి, జూన్ 16(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పండించే పంటలకు మద్దతు ధరలు ఖరారు చేసింది. అందులో అత్యధికంగా పత్తి క్వింటాకు రూ.589 పెంచడంతో సాగు రైతులకు ఊరట లభించింది. సంగారెడ్డి జిల్లాలో వానాకాలం రైతులు అధికంగా పత్తి సాగు చేస్తారు.

కేంద్రం మద్దతు ధర పెంచడంతో వ్యవసాయశాఖ అధికారుల అంచనాలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం క్వింటాకు రూ.7,521 ధర ఉండగా.. రూ.589 పెంపుతో ఈ ఏడాది ధర రూ.8.110గా నిర్ణయించింది. పత్తి తర్వాత సోయాకు రూ.436 పెరగగా గతేడాది ధర రూ.4,892 ఉండగా.. ఈసారి రూ.5,328 కానుంది. వరి ధాన్యంపై కేవలం రూ.69 మాత్రమే పెరిగింది.

వ్యవసాయమే ఆధారం.. అందులోనూ పత్తి సాగే ప్రధానంగా ఉన్న జిల్లాకు ధరల పెరుగుదల కాస్త కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ యంత్రాల ధరలతో పోలిస్తే మద్దతు ధరలు మరింత పెరిగితే బాగుండేదన్న భావన రైతుల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈ ఏడాది పత్తి 3.80 లక్షల ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారుల ప్రాథమిక అంచనా. 

రైతుల చూపు.. పత్తి వైపు...

పత్తికి మద్దతు ధర అధికంగా పెంచడం, సీసీఎస్ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండటంతో చాలామంది రైతులు పత్తి సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో పత్తిని కర్ణాటకకు తీసుకెళ్లి విక్రయించే వారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం వరి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తుండటంతో జిల్లాలో పత్తి తర్వాత రెండో స్థానంలో వరి నిలిచింది. అయితే కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.589 పెంచి.. వరికి మాత్రం కేవలం రూ.69 పెరగడంతో వరిసాగు రైతులు నిరాశలో ఉన్నారు. 

వరికి రూ.3 వేలు ఇవ్వాలి..

పెట్టుబడులు పెరుగుతున్నందున ఏటా వరి క్వింటాకు రూ.3 వేలు ప్రకటించాలని వరి సాగు రైతులు కోరుతున్నారు. కేంద్రం కేవలం రూ.69 పెంచడం ఎంతో నిరాశకు గురవుతున్నారు. ఎకరా వరి సాగుకు ప్రస్తుతం రూ. 40 వేలు ఖర్చవుతోందని, మరోమారు పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. 

ఆదేశాలు రావాలి..

కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల పెంపుపై ఆదేశాలు వస్తే ఈ వర్షాకాలం పంటల నుంచి అమలవుతోంది. ప్రస్తుత వానాకాలంలో జిల్లాలో 3.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కానున్నట్లు అంచనా వేశాం. ధర పెరగడంతో మరింత పెరిగే అవకాశం ఉండొచ్చు. అలాగే కంది సాగుపై కూడా రైతులు దృష్టిసారిస్తున్నారు.

 శివప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి