calender_icon.png 17 September, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

317 జీవో బాధితులకు ఊరట

17-09-2025 12:42:06 AM

ఉద్యోగులకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లు 

190 జీవో జారీ చేసిన సర్కార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టీజేఏసీ

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): 317 జీవో బాధితులకు ఊరట లభించనుంది. 317 జీవో కారణంగా స్థానికత కోల్పోయి వేరే జిల్లా, జోన్‌కు వెళ్లిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లకు సర్కారు అనుమతులిచ్చింది. ఈ మేరకు జీవో నెం.190ను మంగళవారం జారీ చేసింది. స్థానికత కోల్పోయి నూతన జిల్లాలకు బదిలీలై ఇబ్బందులు పడుతున్న వారి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని గతంలో ఏర్పాటు చేసి బాధితుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది.

ఈ క్రమంలోనే వారికి తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇంటర్ లోకల్ క్యాడర్ తాత్కాలిక బదిలీలకు అనుమతులిచ్చింది. అయితే వీరికి ఖాళీలున్న జిల్లాల్లో మొదట రెండేళ్ల్లు, గరిష్టంగా మూడేళ్లకు మాత్రమే బదిలీలు, డిప్యూటేషన్లకు అనుమతులివ్వనున్నారు. ఆతర్వాత తిరిగి పేరెంట్ (మాతృ) కేడర్‌కు రావాల్సి ఉంటుంది.

కేవలం అదే విభాగంలో, స్థానిక కేడర్‌లో ఉన్న ఖాళీలకు మాత్రమే వర్తిస్తుంది. డిసిప్లినరీ కేసులు ఉన్నవారికి అవకాశం లభించదు. డిప్యూటేషన్ ఉద్యోగులకు టీఏ, డీఏ హక్కు ఉండదు. ఒకసారి డిప్యూటేషన్ పొందిన ఉద్యోగి మళ్లీ అర్హత పొందరు. జీవో నెం. 317(06.12.2021) తర్వాత పదోన్నతి పొందిన వారు దీనికి అర్హులు కాదని మార్గదర్శకాల్లో పేర్కొంది. బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 

పోరాట ఫలితం: టీజేఏసీ నేతలు  

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ పోరాట ఫలితమే మరోక విజయం సాధించినట్లు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసర రావు పేర్కొన్నారు. 317 జీవో బాధిత ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలు, డిప్యూటేషన్లకు జీవో నెం.190ను ప్రభుత్వం జారీ చేయడం జేఏసీ సాధించిన ఘనత అన్నారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్‌కు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మొత్తం క్యాబినెట్‌కు ఈమేరకు వారు ధన్యవాదాలు తెలిపారు.