calender_icon.png 14 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ ఆస్పత్రులపై నివేదిక ఇవ్వాలి

14-11-2025 12:22:58 AM

  1. పార్కింగ్ స్థలం, ఫైర్ సేఫ్టీ లేదు

జిల్లా వైద్య, మునిసిపల్, ఫైర్ శాఖలపై ఆగ్రహం

దిశ సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు

సిద్దిపేట, నవంబర్ 13 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు పార్కింగ్ స్థలాలు లేవని, సెట్ బ్యాక్ స్థలాలలో జనరేటర్స్ ఏర్పాటు చేసుకొని ఆక్రమించుకున్నారని విజయక్రాంతి వరుస కథనాలు ప్రచురించింది. మునిసిపల్, వైద్యశాఖ అధికారుల వివరణతో ప్రచురించినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న విషయం దిశ సమీక్షలో బట్టబయలైంది.

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అధ్యక్షతన గురువారం సిద్దిపేట జిల్లా దిశ సమావేశం నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు విజయక్రాంతి ప్రచురించిన కథనాలను ఒక్కొక్క అంశాన్ని స్పష్టంగా మూడు శాఖల అధికారులను వివరణ కోరారు. అధికారుల వద్ద సరైన సమాధానాలు లేకపోవడం, నీళ్లు మింగుతూ సమాధానం చెప్పడం ఎంపీకి ఆగ్రహాన్ని కలిగించింది.

ప్రవేట్ ఆసుపత్రులు కొనసాగుతున్న భవనాలు ఎన్ని స్క్వేర్ ఫీట్లలో ఉంది? పార్కింగ్ స్థలం ఎంత ఉంది? ఫైర్ సేఫ్టీ ఉందా? నిబంధనల మేరకే భవనాలు నిర్మించారా? రోగుల వద్ద వసూలు చేస్తున్న ఫీజుల పట్టిక ఏర్పాటు చేశారా? ఆ భవనాలకు ప్రభుత్వం వసూలు చేస్తున్న టాక్సీ ఎంత? సెట్ బ్యాక్ స్థలాలు ఆక్రమించారా? కనీసం అంబులెన్స్ వెళ్లలేని స్థితిలో ఉన్న ఆస్పత్రులు ఎన్ని? ఇలాంటి అంశాలతో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

సిద్దిపేట మున్సిపల్ అధికారులకు ఆసుపత్రుల జోన్ లో నివాసముంటున్న ప్రజలు ప్రత్యక్షంగా ఫిర్యాదు చేసిన, దినపత్రికలలో వార్తా కథనాలు ప్రచురించిన వారికి జేబులు నింపుకునే అవకాశం లభిస్తుంది తప్ప ప్రజలకు సౌకర్యవంతంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్న కనీస బాధ్యత లేకపోవడం అత్యంత దురదృష్టకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ రఘునందన్ రావు ఆదేశాలతోనైనా అధికారుల పనితీరులో మార్పు రావాలని ప్రజల ఆశిస్తున్నారు. విజయక్రాంతి ప్రచురించిన కథనాలపై దిశ సమావేశంలో చర్చ జరగడం పట్ల విజయక్రాంతి పై అభినందనలు వెల్లువెత్తాయి.