14-11-2025 12:21:41 AM
ప్రధాన పాత్రధారి రాజు
సిద్దిపేట క్రైం, నవంబర్ 13 : సిద్దిపేటకు చెందిన శివరాత్రి రాజు ప్రధాన పాత్రలో రూపొందిన ’గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంజాయ్ కోరుకునే యువకులు గోవాలో ఎదుర్కొన్న పరిస్థితులు, పర్యావసనాలపై రూపొందించిన ఈ సినిమాకు శశి దర్శకత్వం వహించారు. సినిమాకు సంబంధించిన విశేషాలనుదర్శకుడు శశి, ప్రధాన పాత్రధారి రాజు గురువారం ప్రెస్ క్లబ్ లో వెల్లడించారు.
అవంతి సినిమా బ్యానర్, సాయి కుమార్ నిర్మాణ సారథ్యంలో రూ.కోటి బడ్జెట్ తో, ఎనిమిది ప్రదాన పాత్రదారులతో నిర్మించిన చిత్రం 70 థియేటర్లలో రిలీజ్ కాబోతుందని చెప్పారు. శనివారం సిద్దిపేటలోని శ్రీనివాస్ థియేటర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. 20 రోజుల్లో షూటింగ్ ముగించుకుని ఎక్కడా చిన్న సినిమా అనే అభిప్రాయం కల్గకుండా, సహజత్వం ఉట్టిపడేలా సినిమాను తీశామన్నారు.
ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని దర్శకుడు కోరారు. ప్రధాన పాత్రధారి రాజు మాట్లాడుతూ, పట్టణంలోని 15 వ వార్డు ఇమాంబాద్ కు చెందిన తాను ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి సినిమానే ప్రపంచంగా బతుకుతున్నా అన్నారు. అవకాశం వస్తే తానేంటో నిరూపించుకుంటానని చెప్పారు. గోపి గాళ్ల గోవా ట్రిప్ సినిమాను ఆదరించాలని కోరారు.