15-11-2025 07:39:21 PM
సిద్దిపేట,(విజయక్రాంతి): కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం, జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షిస్తూ శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కే. హైమావతి అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 14, 2025 (ఆదివారం) ఉదయం 10:45 గంటలకు స్వామి వారి కల్యాణం, జనవరి 18, 2026 నుండి మార్చి 16, 2026 వరకు ప్రతి ఆదివారం, బుధవారం జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మేడారం జాతర కారణంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. భద్రతా దృక్కోణానికి ప్రాధాన్యతనిస్తూ జాతర ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర మానిటరింగ్ చేయాలని, పార్కింగ్ సదుపాయాలు, బ్యారికెడింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్‌లో మైక్ అనౌన్స్‌మెంట్లు సమర్థవంతంగా ఉండాలని సూచించారు.
లడ్డూ కౌంటర్లు పెంచడం, భక్తుల క్యూ లైన్లను సక్రమంగా నిర్వహించడం, రద్దీ తగ్గించేందుకు అన్నదానం కేంద్రాలను విస్తరించడం, విధులు నిర్వహించే సిబ్బందికి స్థానికంగా భోజన వసతి కల్పించడం వంటి చర్యలను తీసుకోవాలని ఆమె తెలిపారు. శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణానికి తక్షణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ లైన్లను ముందుగానే సరిచూడడం, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం, వైద్య సేవలను 24 గంటలు అందుబాటులో ఉంచేందుకు మూడు షిఫ్టుల వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కూడా సూచించారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, తగిన సంఖ్యలో సానిటేషన్ సిబ్బందిని మూడు షిఫ్టులలో విధులు నిర్వహించేందుకు నియమించాలని, త్రాగునీటి సమస్యలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర ప్రాంతంలో మద్యం విక్రయాలు అక్రమంగా జరగకుండా పర్యవేక్షించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీ బస్సులను రూట్ల వారీగా నడపాలని, అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచాలని ఆమె ఆదేశించారు.