10-11-2025 12:32:06 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 9 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఆర్‌కే (రేవంత్‌రెడ్డి, కేటీఆర్) బ్రదర్స్ పాలన నడుస్తున్నదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ తీసుకోలేదని భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద ప్రమాణం చేసే దమ్ము కేటీఆర్‌కు ఉందా అంటూ సవాల్ చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు కేటీఆర్, రేవంత్‌రెడ్డి కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచార చివరి రోజున కేంద్ర మంత్రి బండి సంజయ్.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు డ్రగ్స్ టెస్ట్ సవాల్ విసిరారు. అదే సమయంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం, ఆయన ఆస్తులపై సంచలన ఆరోపణలు చేశారు. అదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పాదయాత్ర అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు.
“కేటీఆర్.. నీకు దమ్ముంటే, నువ్వు ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేయ్. రేపు ఉదయంలోపు ప్రమాణం చేస్తే జూబ్లీహిల్స్ ప్రజల పక్షాన మీకే ఓటేయమని నేను అప్పీల్ చేస్తా” అని సవాల్ విసిరారు. “అయ్య పేరు చెప్పుకుని గెలిచిన బతుకు కేటీఆర్‌ది. తెలంగాణ కోసం, హిందుత్వం కోసం పోరాడి ఏడుసార్లు జైలుకు వెళ్లొచ్చిన నాతో నీకు పోలికా” అని ఘాటుగా ప్రశ్నించారు.
హిందూ ఓటు బ్యాంకు దమ్మేంటో చూపిస్తాం
బీజేపీ అంటేనే హిందువు, హిందువు అంటేనే బీజేపీ అని బండి సంజయ్ అన్నారు. 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పనిచేస్తున్నాయని, 80 శాతం హిందువుల పక్షాన పోరాడుతోంది బీజేపీయేనని చెప్పారు. హిందూ ఓటు బ్యాంకు దమ్మేంటో ఈ ఎన్నికల్లో చూపిస్తాం అని అన్నారు. రాష్ర్టంలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం ఇస్తున్న నిధులతోనే అని బండి సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేము కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
మాగంటి గోపీనాథ్ మరణం ఓ కుట్ర!
మాగంటి గోపీనాథ్ మరణం వెనుక, ఆయన ఆస్తుల విషయంలో పెద్ద కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. గోపీనాథ్ జూన్ 8న చనిపోతే, అదే నెల 25న ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు.
అందుకు సంబంధించిన ఆడియోను గోపీనాథ్ కుటుంబ సభ్యులు తనకు వినిపించారని చెప్పారు. మాగంటి సునీత తప్పుడు ఆధారాలతో ఫ్యామిలీ సర్టిఫికెట్ తెచ్చుకుంది, అది రద్దయింది. ఆమెకు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయి, ఒకదానిలో భర్త పేరు సునీత మనోహర్ అని, ఇంకోదానిలో మాగంటి గోపీనాథ్ అని ఉందని ఆరోపించారు. 2023 అఫిడవిట్‌లో నిరక్షరాస్యురాలని, 2025 అఫిడవిట్‌లో పదో తరగతి అని తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు.
గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉంటే, ఆయన కన్నతల్లిని కూడా చూడనీయలేదని ఆరోపించారు. అదే ఆసుపత్రి 9వ అంతస్తులో కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులు కాజేసే కుట్రకు తెరలేపింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ ఆస్తుల వాటా కోసం కేటీఆర్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, అందుకే ఈ మిస్టరీపై విచారణ జరపడం లేదని ఆరోపణలు చేశారు.