24-09-2025 05:19:15 PM
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన గ్రామసభను గ్రామస్తులు అడ్డుకున్నారు. మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ, అటవీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభను గ్రామస్తులు అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యం ఆర్కేపి ఓసీపీ ఫేజ్-2 విస్తరణ కోసం ఇందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని తుర్కపల్లి, సారంగపల్లి, వెంకటాపూర్, మంచిర్యాల బీట్ ల పరిధిలోని 366.4198 హెక్టార్ల అటవి భూమి సేకరణ కోసం పంపిన ప్రతిపాదన మేరకు పోడు వ్యవసాయం, అటవీ హక్కు దారుల వివరాల సేకరణ కోసం గ్రామ సభ నిర్వహించగా గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఆర్కె ఓసి ప్రాజెక్టు-2 విస్తరణ పనులను వెంటనే విరమించుకోవాలని కోరారు. ఓసిపి విస్తరణ చేపడితే గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి, వాతావరణ, శబ్ద కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామం మట్టి దిబ్బలుగా మారడమే కాక, ఓసి బ్లాస్టింగ్ పేలుళ్లకు ఇల్లు నష్టపోవాల్సి వస్తుందని, అంతే కాకుండా గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఓసి విస్తరణ ద్వార గ్రామ రైతులకు సంబంధించిన భూములు లేనప్పటికీ గ్రామానికి నష్టం జరిగే ప్రమాదం ఉన్నందున ఓసి పనులను విరమించు కోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ విస్తరణలో భాగంగా ప్రజలకు సంబంధించిన పట్టా భూములు లేవని, కేవలం అటవి శాఖ పరిధిలోని పోడు వ్యవసాయం, అటవి హక్కులున్న వారికి జరిగే నష్టం పై వివరాలు సేకరించేందుకు గ్రామసభ ను నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు .