02-11-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, నవంబర్ 1 : భారత టెన్నిస్‌లో మరో శకం ముగిసింది. లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత భారత పురుషుల టెన్నిస్‌లో తనదైన ముద్రవేసిన రోహన్ బోపన్న ఆటకు వీడ్కోలు పలికాడు. ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. 45 ఏళ్ళ బోపన్న పారిస్ మాస్టర్స్‌లో చివరిసారిగా ఆడాడు. గాయాలు వెంటాడినా అతను టెన్నిస్ రాకెట్‌ను వదల్లేదు.
రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ కెరీర్‌లో 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో విజేతగా నిలిచిన బోపన్న గ్రాండ్‌శ్లామ్ గెలిచిన అత్యధిక వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే అతిపెద్ద వయసులో డబుల్‌లో నెంబర్ వన్ ర్యాంక్ సాధిం చిన ఆటగాడిగానూ ఘనత సాధించాడు. తన కెరీర్‌లో సింగిల్స్ ప్లేయర్‌గా సక్సెస్ కాలేకపోయిన బోపన్న డబుల్స్‌లో మాత్రం అద రగొట్టాడు.
2017లో ఫ్రెంచ్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్‌ను ఆరుసార్లు గెలిచిన బోపన్న తన కెరీర్‌లో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. బోపన్నకు 2019లో అర్జున అవార్డ్, 2024లో పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.