27-10-2025 02:01:55 AM
హామీల్లో కాంగ్రెస్ అర్రాస్ పాట పాడింది
కారు కావాలా.. బుల్డోజర్ కావాలా?
రాబందు ప్రభుత్వం పోవాలి.. రైతు ప్రభుత్వం రావాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ భవన్‌లో తెలంగాణ హోటల్స్ కార్మిక యూనియన్, వడ్డెర సంఘం నాయకులతో సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ర్టంలో రౌడీషీటర్ల పాలన సాగుతోందని, ప్రభుత్వంలో అలీబాబా దొంగల ముఠా తయారైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం తెలంగాణ హోటల్స్ కార్మిక యూనియన్, వడ్డెర సంఘం నాయకులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు.
పలువురు హోటల్స్ కార్మిక నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హోటల్‌లో పనిచేసే కార్మికులు బతుకుదెరువు కోసంహైదరాబాద్‌కు వచ్చారని, బీఆర్‌ఎస్ హయాంలో హోటల్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని, కానీ ప్రస్తుతం రాష్ర్టంలో పరిపాలన రౌడీషీటర్ల పాలన అయిందని విమర్శించారు.
మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరిం చారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారని, మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్‌రెడ్డి, రోహిన్‌రెడ్డి అని చెప్పారని గుర్తు చేశారు. రాష్ర్టంలో దండుపాళ్యం ముఠా, అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారు అయిందని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ పెద్దల వేధింపులకు మంచి ఐఏఎస్ అధికారి రాజీనామా చేశారని, లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్టు కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికి చెప్పలేక ఐఏఎస్ రాజీనామా చేశారని వెల్లడించారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని, అందుకే ఓఆర్‌ఆర్ లోపల కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాలేదన్నారు.
ఎన్నికల ముందు హామీల్లో కాంగ్రెస్ అర్రాస్ పాట పాడిందని వ్యాఖ్యానించారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని, పెద్దవాళ్లకు రూల్స్ ఉండవని, అందుకే కాంగ్రెస్ పార్టీకి చురుకు పెట్టాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలంగాణకు లాభం చేసే తీర్పు ప్రజలు ఇవ్వాలని కోరారు.
రేవంత్‌రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని, జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర ప్రజలకు తెలుసని చెప్పారు. రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్ళను గెలిపిస్తారా, కారు కావాలా.. బుల్డోజర్ కావాలా.. అని ఆలోచించుకోవాలన్నారు.
రాష్ట్రంలో రాబందు ప్రభుత్వం పోవాలి, కేసీఆర్ రైతు ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను మరోసారి సీఎం చేసే అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోనే వచ్చిందని చెప్పారు.
వడ్డెర భవనానికి కేసీఆర్ స్థలం,నిధులిచ్చారు: హరీశ్‌రావు
కేసీఆర్ ప్రభుత్వమే వడ్డెర సమాజానికి సహాయం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని, పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ హైదరాబాదులో లక్ష డబల్ బెడ్ రూమ్ ఇల్లులు కట్టారని, రేవంత్‌రెడ్డి లక్ష ఇండ్లను కూలగొట్టారని మండిపడ్డారు.
పేదల ఇండ్లు కూల్చొద్దంటే, హైడ్రా బందు కావాలంటే కాంగ్రెస్‌ను ఓడకొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి డబ్బు మూటలను, గుండాలను నమ్ముకున్నారని, ఓటుతో రేవంత్ రెడ్డి చెంపలు వాయించి బుద్ధి చెప్పాలన్నారు. అడగకపోయినా హైదరాబాదులో వడ్డెర సంఘానికి ఎకరం భూమిని కేసీఆర్ ఇచ్చారని, వడ్డెర ఆత్మగౌరవ భవనానికి స్థలాలను,
దాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రారంభించిన బీసీ ఆత్మగౌరవ భవనాలకు నిధులు విడుదల చేసి పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వడ్డెర్లకు రాజకీయ ప్రాతినిధ్యం
వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా కేసీఆ ర్‌తో మాట్లాడి కృషి చేస్తానని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఎప్పుడూ కులం, మతం పేరుతో రాజకీయాలు చేయలేదని, పేదవారిని పేదవారిగానే చూసి, వారికి సహాయం చేశారని స్పష్టం చేశా రు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అభివృద్ధి జరుగుతుందంటూ మరోసారి ప్రజలను కాంగ్రెస్ మోసం చేయబోతున్న దన్నారు.
రెండేళ్ల క్రితం కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, ఆ తర్వాత వారు ఏమి సాధిం చారో చెప్పలేదన్నారు. ఆ ఉపఎన్నికల్లో ప్రచారం చేసిన మంత్రులు ఇప్పటికి అక్కడికి రాలేదని తెలిపారు. కానీ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్నవారు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులేనని స్పష్టం చేశారు. రానున్నది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, కాబోయేది సీఎం కేసీఆరే అని ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా బీఆర్‌ఎస్ పార్టీ విజయయాత్ర జూబ్లీహిల్స్ నుం చే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.