27-10-2025 02:01:16 AM
-సింగరేణిలో జాబ్‌లు మృగ్యం
-కొత్త గనులు ఎక్కడా సారూ?
-బయటి కంపెనీలే యువకులకు దిక్కు
-ప్రైవేటు ఉద్యోగాలే జీవనాధారం
బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 26: తెలంగాణ కు కొంగుబంగారమైన సింగరేణి తల్లి నిరుద్యోగులకు నిలువ నీడ, కూడు పెట్టలేని పరిస్థితికి నెట్టబడిందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. స్వయంగా సింగరేణి యాజమాన్య మే స్థానికంగా ఉద్యోగాలు లభించవని మరోసారి రుజువు చేసింది. సింగరేణిలో మెగా జాబ్ మేళా పేరుతో సింగరేణిలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించే గొప్ప కార్యక్రమంగా తమను తాము కీర్తించుకుంటుంది.
70 ప్రైవేటు కంపెనీలను పిలిపించి ఉద్యోగాల కోసం సింగరేణిలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నది. అనూహ్యంగా సామాజికంగా, పారిశ్రామిక రంగంలో వచ్చిన పెను మార్పులు సింగరేణి పాలిట శాపంగా మారాయి. స్వయం ఉత్పత్తి, ఉద్యోగాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. యాంత్రికరణ సింగరేణి ప్రగతికి ప్రధాన అవరోధమ యింది. దీంతో సింగరేణి పారిశ్రామిక అభివృద్ధి వెనుకపట్టుకు దారి తీసింది. ఒకప్పు డు వందల భూగర్భగనులు, లక్ష 20వేల కార్మికులు ఉండేవారు. ఉద్యోగాలకు అనుబంధం గా ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉండేవి.
మూసివేత దారిలో గనులు
1991 ప్రాంతంలో సింగరేణిలో ప్రవేశించి న నూతన ఆర్థిక విధానాలు సింగరేణి మనుగడకు విఘాతంగా మారాయి. సింగరేణిలో యంత్రాలతో పని విధానం అమల్లోకి వచ్చిం ది. బొగ్గు మార్కెట్‌లో వినియోగదారుల మధ్య బొగ్గు రవాణా పోటీ ఎక్కువైంది. దీంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు ప్రతిష్టాత్మకంగా మారా యి. కార్మికుల సంక్షేమం, ఉద్యోగాలు పక్కదారి పట్టాయి. అనుకున్న లక్ష్యాలే సింగరేణి కంపెనీకి ముఖ్యమైంది.
బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునేందుకు మానవ వనరుల వేగం సరిపోతలేదని భావించింది. కార్మికుల శ్రమశక్తి ప్రమాణాలు పడిపోయాయి. అత్యాధునిక మైన భారీ యంత్రాలను కొనుగోలు చేశారు. అందుకు తగ్గట్టుగా బొగ్గు ఉత్పత్తి కోసం భూగ ర్భ గనులను ఈ పోటీ నుంచి క్రమంగా తప్పించారు. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లే ఉత్పత్తి, ఉత్పాదకత సాధనాలుగా ఎంచుకున్నారు. ప్రధాన పోటీలో ఓపెన్ కాస్ట్ యంత్రాలే నిలబడ్డాయి. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లే సింగరేణికి ప్రధాన దిక్కు అయ్యాయి. ఇక అప్పటి నుంచి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు మించి ఉత్పత్తి జరుగుతుంది.
ఉపాధిని కొల్లగొట్టిన ఓపెన్ కాస్ట్‌లు
బొగ్గు నిక్షేపాలు ఉన్నా, లేకున్నా లాభాల కారణంతో భూగర్భ గనులు మూసివేతకు గురయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు, మొదలుకొని బెల్లంపల్లి, రామగుండం, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, గోలేటి ఏరియాలలో తొలితరం భూగర్భ గనులన్నీ మూతపడిపోయాయి. పారిశ్రామిక ప్రాంతా లు మణుగూరు, సత్తుపల్లి, ఏరియాలో భూగ ర్భ గనుల విస్తరణ జరిగింది. ఈ ప్రాంతంలో కూడా భూగర్భ గనుల తర్వాత ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లకే సింగరేణి పెద్దపీట వేస్తున్నది.
ఈ నేపథ్యంలో లక్ష 20 వేల కార్మికులకు గాను సింగరేణిలో ప్రస్తుతం 40 వేల మంది కార్మికులు మాత్రమే మిగిలారు. ఇలా గనులు తగ్గాయి. కార్మికులు తగ్గారు. ప్రైవేటు కంపెనీలే కార్మిక పిల్లలకు, నిరుద్యోగులకు దిక్కయ్యా యి. నిరుద్యోగ సంక్షోభంపై దృష్టి మళ్లించేందుకే సింగరేణి యాజమాన్యం ఇలాంటి జాబ్ మేళాలతో మభ్యపెడుతూ వస్తున్నదన్న అభిప్రాయాలు కార్మికులు, ప్రగతి కాముక కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణిలో కొత్తగా భూగర్భ గనులు తీసుకొచ్చి నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా? అని కార్మిక లోకం ప్రశ్నిస్తున్నది.