02-07-2025 12:01:55 AM
భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జులై 1 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం 41.07 లక్షల రూపాయలను మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని ఐదు జూనియర్ కళాశాలలల్లో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నిధులతో సివిల్ మరమ్మతులు, ఎలక్ట్రికల్, మంచినీరు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి సదుపాయాలపై ఫోకస్ చేయాలని, ఇట్టి పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకన్న, డీఈఓ రాజేందర్, టీజీడబ్ల్యూఐడిసి డిఈ రామకృష్ణ, ఏఈ మహేందర్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్ళు పాల్గొన్నారు.