18-09-2025 12:00:39 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (హైడ్రా -డీఆర్‌ఎఫ్) సిబ్బంది తమ జీతాల్లో కోత విధించారంటూ బుధవారం ఉదయం బుద్ధ భవన్ వద్ద ఆం దోళనకు దిగారు. ప్రభుత్వ నూతన జీఓ కారణంగా తమ వేతనంలో సుమారు రూ.5 వేలు తగ్గాయని ఆరోపిస్తూ విధులు బహిష్కరించారు.
హైడ్రా కింద 1,100మంది సిబ్బంది
గతంలో జీహెఎంసీ పరిధిలోని ఈవీడీఎంలో పనిచేసిన సుమారు 1,100 మంది డీఆర్‌ఎఫ్ సిబ్బంది, ప్రస్తుతం హైడ్రా కింద విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఏకీకృత వేతనాలు అందించేం దుకు జీఓ నెం. 1272ను జారీ చేసింది. ఈ జీఓ అమలు కారణంగా, తమకు గతంలో వస్తున్న జీతం కంటే రూ.5వేలు తక్కువగా వస్తోందని డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
రాత్రి పగలూ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమ జీతాల్లో కోత విధించడం అన్యాయమని, ఈ నెల చాలా మందికి జీతం తగ్గిందని ఆరోపిస్తూ బుద్ధ భవన్ వద్ద నిరసనకు దిగారు. సిబ్బంది ఆందోళనపై హైడ్రా యాజమాన్యం వెంటనే స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. జీతాల్లో ఎలాంటి కోత విధించలేదని స్పష్టం చేసింది.
ప్రభుత్వ జీఓ ప్రకారం వేతనాలను సవరించామని, అయితే పాత జీతానికి, కొత్త జీతానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జీహెఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో పొంది చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఈ మ్యాచింగ్ ఫండ్ విడుదలకు జీహెఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరమని, ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగిందని వివరించింది. ఉద్యోగులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుతానికి జీఓ ప్రకారం జీతాలు జమ చేశామని, త్వరలోనే మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని పేర్కొంది.
కమిషనర్ హామీతో విధుల్లోకి..
ఈ విషయమై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉద్యోగ ప్రతినిధులతో చర్చలు జరిపారు. జీతాల్లో ఎలాంటి కోత ఉండబోదని, గతంలో అందుకున్న పూర్తి వేతనాన్ని జీహెఎంసీ నుంచి గ్రాంట్ రాగానే సర్దుబాటు చేస్తామని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిషనర్ హామీతో సంతృప్తి చెందిన సిబ్బంది తమ ఆందోళనను విరమించి, వెంటనే విధుల్లో చేరారు. దీంతో ఉదయం నుంచి నెలకొన్న ఉద్రిక్తతకు తెరపడింది.