31-01-2026 12:05:52 AM
సర్పంచ్ సమాచారంతో స్పందించిన రెవెన్యూశాఖ
బూర్గంపాడు, జనవరి 30 (విజయక్రాంతి): బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక తాళ్లగొమ్మూరు గోదావరి ఒడ్డు సమీపంలో ఇసుక అక్రమారులు నిల్వచేసిన ఇసుక స్టాక్ పాయింట్ ను తహశీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. గోదావరి ఒడ్డున తాళ్లగొమ్మూరు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయడంతో సర్పంచ్ గుమ్మడి కృష్ణవేణి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.
తహశీల్దార్ కేఆర్ కెవి ప్రసాద్ స్పందించి రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో ఆరి వీర్రాజు, జీపీవో ప్రసాద్, వెంకన్నలు సంఘటనా స్థలానికి చేరుకుని ఇసుక స్టాక్ పాయింట్ ను సీజ్ చేశారు. మహిళా సర్పంచ్ అయినప్పటికీ ధైర్యంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఇలాంటి చర్యలు చేపట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.