11-12-2025 12:00:00 AM
కలెక్టర్ తేజస్ నందనల్ పవర్
తుంగతుర్తి, డిసెంబర్ 10: జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని అధికార శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం తొలి విడత ఎన్నికలకు సంబంధించి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని ప్రిసైడింగ్ అధికారులు ఇతర సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అందజేసి తగు సూచనలు చేశారు.
నేటి ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తి చేయగా రెండు గంటల నుండి కౌంటింగ్ మొదలవుతుందని తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 159 గ్రామపంచాయతీలు ఉండగా 152 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు.1403 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. స్టేజ్ 1కు 52 మంది రిటర్నింగ్ అధికారులు ఉండగా, స్టేజ్ 2 కు 152 మంది రిటర్నింగ్ అధికారులు నియమించినట్లు తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీకి నియమించిన ఒక ఆర్ ఓ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈరోజు పోలింగ్ సిబ్బందికి ఎన్నికల పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసినట్లు తెలిపారు.ప్రతి ఓటరు హక్కును వినియోగించుకునే వాతావరణం ఏర్పడాలని అన్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు.పోలింగ్ స్టేషన్ల వద్ద తగిన పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత శాఖలకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లని, ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధంగా ఎన్నికలు పూర్తిగా సజావుగా జరిగేలా చర్యలు కొనసాగుతాయని అన్నారు.