21-11-2025 01:06:16 AM
రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఇబ్రహీంపట్నం, నవంబర్ 20: రంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా యంత్రాంగానికి సూచించారు. గురువారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డిసిపిలు సత్యనారాయణ, పూర్ణ చంద్రరావు, ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు, ఎస్సి, ఎస్టి అభివృద్ధి, సంక్షేమ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో ల్యాండ్, అట్రాసిటీ కేసులలో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చొరవ చూపాలనీ, అన్ని రకాల పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గ్రామాభివృద్ధి కమిటీలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్ వెంకటయ్య అదనపు కలెక్టర్, డి.సీ.పీలకు సూచించారు. అధికారులు ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలను వసతి గృహాలను తరచు తనిఖీలు చేయాలన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెరుగైన విద్యను అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపులకు గురిచేసే అధికారులపై కఠిన చర్యలు కమిషన్ తరపున తీసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లకు సంబంధించిన అన్ని రకాల కేసులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రతి నెల రోజులకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ సమస్యలపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్, ఎస్పీలకు, ఎస్సీ కమిషన్ చైర్మన్ సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ చంద్రా రెడ్డి మాట్లాడుతూ.. భూమి సమస్యలపై ఆర్డీవోలతో ఎంక్వయిరీ చేయించి ఎస్సీ, ఎస్టీ లకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు వసతి గృహాల సమస్యల కోసం పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు వివరించారు. జిల్లాలో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, డిఆర్‌ఓ సంగీత, డిసిపిలు సత్యనారాయణ, పూర్ణచంద్రరావు, ఉదయ్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామరావ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామావేశ్వరి దేవి,జిల్లా పరిషత్ సిఈఓ కృష్ణారెడ్డి, ఆర్డీఓలు చంద్రకళ, వెంకట్ రెడ్డి, సరిత తహాసీల్దారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.