02-08-2025 02:17:46 AM
శేరిలింగంపల్లి, ఆగస్టు 1 : మియపూర్ లో విషాదం చోటుచేసుకుంది. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ల్యాబ్ టెక్నీషియన్ ను స్కూల్ బస్సు ఢీకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన గోకుల్ ప్లాట్స్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. కూకట్పల్లి ప్రాంతంలో ఓ ప్రైవేట్ డయగ్నొస్టిక్ సెంటర్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న నాగరాజు (32) గురువారం సాయంత్రం విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికెళ్లే క్రమంలో మాతృశ్రీనగర్ వైపు ప్రయాణిస్తున్నాడు.
అదే సమయంలో గ్లోబల్ ఎడ్జ్ స్కూల్కు చెందిన స్కూల్ బస్సు అతడి బైక్ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగరాజుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే మాదాపూర్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడి పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న మియపూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? వేగం అధికమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ బస్సు డ్రైవర్ మద్యం సేవించాడా? వంటి అంశాలపై కూడా విచారణ జరుపుతున్నారు.