13-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12, (విజయ క్రాంతి):పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.మంగళవారం పాల్వంచ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులను ఆయన సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన, శుభ్రమైన విద్యావాతావరణం కల్పించడమే లక్ష్యం అని అందుకోసం ప్రతి పనిని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.కలెక్టర్ పాఠశాల ప్రవేశ ద్వారం నుండి డైనింగ్ హాల్ వరకు, అక్కడి నుండి వసతిగృహం వరకు విద్యార్థులు సులభంగా, సురక్షితంగా నడవడానికి అనువుగా పాదచార మార్గం (పాత్వే) నిర్మాణానికి సివిల్ విభాగం అధికారులను ఆదేశించారు.
పాఠశాల ప్రాంగణం అందంగా, ఆహ్లాదకరంగా మారేందుకు చుట్టూ నీడనిచ్చే పెద్ద చెట్లు, వెదురు మొక్కలు నాటడంతో పాటు పండ్ల చెట్లు, ఔషధ మొక్కలను ప్రణాళికబద్ధంగా పెంచాలని సూచించారు. ఈ మొక్కలు విద్యార్థుల ఆరోగ్యానికి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడేలా సంరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు.
డైనింగ్ హాల్లో విద్యార్థుల సౌకర్యార్థం డైనింగ్ టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు, వ్యర్థ పదార్థాల సమర్థమైన నిర్వహణ కోసం కంపోస్ట్ పిట్స్ నిర్మాణం, చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేయడానికి ప్రత్యేక బుట్టలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు వంటి ఉపయోగకరమైన మొక్కలను నాటారు.
మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, వాటి పెరుగుదల కోసం నిరంతర పరిరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రత్యేకంగా సూచించారు.సిఎస్‌ఆర్, సివిల్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, విద్యార్థులకు మరింత మెరుగైన వసతులు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పాఠశాల ప్రిన్సిపల్ మైథిలి, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, నవభారత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.