calender_icon.png 10 September, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశాభివృద్ధికి శాస్త్రవేత్తలు అవసరం

09-09-2025 12:30:45 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం/కరకగూడెం, సెప్టెంబర్ 8, (విజయక్రాంతి):దేశ అభివృద్ధి కి, ప్రజల భవిష్యత్ పురోగతికి శాస్త్రవేత్తలు అవసరం అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ కరకగూడెం జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల సమగ్ర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులు, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్ ,మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను ఆయన పరిశీలిస్తూ సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారి జీవిత లక్ష్యాలను తెలుసుకున్నారు.

విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని తమ అభిలాషను తెలియ జేయగా, కలెక్టర్ మాట్లాడుతూ వ్యక్తిగత లక్ష్యసాధనతో పాటు దేశాభివృద్ధికి తోడ్పడే దిశగా చదువుకోవడం, పరిశోధనలు చేయడం అత్యంత ముఖ్యమని సూచించారు. సమాజంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలు, పరిశోధనలు చేయగలిగే శాస్త్రవేత్తలు దేశానికి ఎంతో అవసరమని, విద్యార్థులు ఆ దిశగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

తరువాత కలెక్టర్ డైనింగ్ హాల్ పరిశీలించి అక్కడ దోమలు, ఈగలు లోపలికి ప్రవేశించకుండా మెష్ ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అలాగే కూరగాయలు, పెరుగు తదితర పదార్థాలు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్ ఏర్పాటు చేయాలన్న సిబ్బంది అభ్యర్థనపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన, పౌష్టికాహారం తీసుకుంటూ చదువు కొనసాగించేలా అన్ని ఏర్పాట్లు ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

నవోదయ విద్యాలయాలు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన బ్రాండ్గా గుర్తింపు పొందాయని, ఆ ప్రతిష్టను నిలబెట్టే విధంగా అధికారులు ప్ర తి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందించాల్సిందిగా ఆయన సూచించారు. అదేవిధంగా వి ద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి అవసరమైన క్రీడా సామాగ్రి, లైబ్రరీ పుస్తకాలు త్వరలో నే ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

కలెక్టర్ పాఠశాల సిబ్బందితో సమావేశమై విద్యార్థులకు అందజేస్తున్న సదుపాయాలు, ఉన్న సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. వి ద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధి కోసం చేపట్టవలసిన పనులను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు.ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ భాస్కరాచారి, ఉపాధ్యాయులు నయనాదేవి, చంచల్, అనిత, స్టాఫ్ నర్స్ రాధిక సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.