calender_icon.png 28 August, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాండ్ల వివాదానికి తెర?

03-08-2024 12:05:00 AM

దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన ఎలక్టోరల్ బాండ్లపై  కోర్టు పర్యవేక్షణలోని ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్)తో విచారణ జరిపించాలంటూ దాఖలయిన పిటిషన్లను సుప్రీంకోర్టు  శుక్రవారం తోసిపుచ్చింది. ఎన్నికల బాండ్ల పేరిట కార్పొరేట్ దాతలు, రాజకీయ పార్టీల మధ్య క్విడ్‌ప్రో కో జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలయిన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సాధారణ చట్టం కింద చర్యలు తీసుకునే మార్గాలు ఉన్నప్పటికీ దీనిపై న్యాయమూర్తితో విచారణకు ఆదేశించడం అనుచితమే అవుతుందని బెంచ్ వ్యాఖ్యానించింది.

అంతేకాదు ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం తొందరపాటే అవుతుందని అభిప్రాయపడింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను రికవరీ చేయడంతో పాటు వాటి ఆదాయం పన్ను మదింపులను తిరిగి తెరవాలన్న పిటిషనర్ల అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. ఆదాయం పన్ను చట్టం కింద ఇవి ఆ శాఖ అధికారులకు సంబంధించిన చర్యలని స్పష్టం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో క్విడ్ ప్రో కో (పరస్పర లబ్ధి) ఉండవచ్చనే ఆరోపణల నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన ధర్మాసనం సిట్ ఏర్పాటుకు నిరాక రించింది. దీంతో ప్రస్తుతానికి ఈ వివాదానికి తెరపడినట్లే అయింది.

రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చడానికి 2018లో అప్పటి అధికార బీజేపీ ప్రభుత్వం ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకువచ్చింది. రాజకీయపార్టీల విరాళాల విషయంలో పారదర్శకతను తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ  ఆర్థిక చట్టానికి సవరణ కూడా చేసింది. దీనివల్ల ఈ బాండ్లలో పారదర్శకత లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు  కూడా దాఖలు చేశారు.

పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని తక్షణమే నిలిపివేయాలని కూడా ఆదేశించింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని ధర్మాసనం తెలిపింది. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంగా స.హ చట్టాన్ని  ఉల్లంఘించడం సమంజసం కాదని అభిప్రాయపడింది. ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలతో పాటు బాండ్లు విక్రయించిన పార్టీల వివరాలను కూడా బహిర్గతం చేయాలని బాండ్ల విక్రయం జరిపిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాను న్యాయస్థానం ఆదేశించింది.

దీంతో ఈ వివరాలను ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు ఎన్నికల కమిషన్‌కు కూడా అందజేసింది. ఈ వివరాల ప్రకారం రూ.20 వేల కోట్ల విలువైన బాండ్లను విక్రయించగా బీజేపీకి అత్యధికంగా రూ.6 వేల కోట్లకు పైగా విరాళాలు అందినట్లు స్పష్టమయింది. బీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలకుకూడా పెద్ద మొత్తంలో విరాళాలు అందాయి. మేఘా ఇంజినీరింగ్ లాంటి సంస్థలు వందల కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేయడంతో ఆ కంపెనీలకు, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు మధ్య క్విడ్ ప్రోకో జరిగి ఉంటుందనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై  కోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరిపించాలంటూ  ఎన్జీవోలతో పాటు పలు సంస్థలు  కోర్టుకెక్కాయి.