calender_icon.png 30 January, 2026 | 5:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ యాక్షన్‌కు నా రియాక్షన్ ఉంటది

30-01-2026 02:15:20 AM

ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నుంచి ఆదేశాలు రాలేదని వెల్లడి 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన అనర్హత పిటిషన్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీఆర్‌ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేయలేదని, వారి యాక్షన్‌కు తన రియాక్షన్ ఉంటుందని ఎమ్మెల్యే దానం పేర్కొన్నారు. తాను ఎన్నికలకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్ కార్యాలయం నుంచి అందిన నోటీసులకు తన తరఫు న్యాయవాది ఇప్పటికే స్పందించారని తెలిపారు.

స్పీకర్‌కు వివరణ ఇస్తూ తన అడ్వకేట్ ఒక లేఖ రాశారని, అయితే ఆ లేఖలో ఏయే అంశాలను పొందుపరిచారనే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని ఎమ్మెల్యే దానం తెలిపారు. తమ తరఫున అడ్వకేట్  వివరణ పంపినప్పటికీ, స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి జవాబు రాలేదన్నారు. విచారణ ప్రక్రియకు సంబంధించి తాము పంపిన వివరణపై స్పీకర్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లుగా దానం పేర్కొన్నారు. విచారణ నిమిత్తం తనను వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పీకర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. తనను వ్యక్తిగతంగా రమ్మని ఎవరూ చెప్పలేదు, ప్రస్తుతానికి లీగల్ టీమ్ ఈ వ్యవహారాన్ని చూసుకుంటోందన్నారు. ఈ క్రమంలో ఈనెల 30న జరిగే విచారణలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.