సెవెన్ పోలీస్ సిస్టర్స్

30-04-2024 12:10:00 AM

వరుసగా అమ్మాయిలే పుడుతుంటే అసంతృప్తితోనే కొడుకు కోసం ఎదురు చూశారు వాళ్లు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది ఆడపిల్లలే పుట్టారు. అయినా సరే ఆ పిల్లల మీద ఏ చిన్న చూపు లేకుండా పెంచాడు కష్టపడుతూనే ఆ పిల్లలని చదివించారు. తండ్రి కష్టాన్ని చూసిన ఆ పిల్లలు కూడా ‘అయ్యో ఆడపిల్లలా!‘ అని జాలి పడ్డవాళ్లకి సమాధానం ఇచ్చారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసు శాఖతో పాటు వివిధ భద్రతా విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లేనా అని ఎవరైనా అనగలరా?? 

బీహార్‌లోని ఛప్రా జిల్లాకు చెందిన కమల్ సింగ్కి 8 మంది అమ్మాయిలు పుట్టారు. ఆఖరిలో నిరాశపరచకుండా ఓ కొడుకు కూడా పుట్టాడు. ఆ ఎనిమిది మందిలో ఒక అమ్మాయి చిన్నప్పుడే చనిపోయింది. మిగిలిన కూతుళ్లని చదివించటానికి, ఓ పూట తిండి పెట్టటానికీ కష్టపడుతూనే చుట్టూ ఉన్నవాళ్ల జాలి చూపులని, హేళన మాటలనీ తట్టుకోలేక సరన్ జిల్లాలోని నాచాప్ గ్రామాన్ని వదిలి భార్యా పిల్లలతో చప్రాలోని ఎక్మాకు వచ్చేశాడు. వ్యవసాయం చేసుకుంటూనే తన కూమార్తెల సాయంతో ఇంటి వద్ద ఓ చిన్న పిండి మిల్లు నడిపేవారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే ఏడుగురు ఆడపిల్లలను చదివించారు. ఆ సమయంలో తినడానికి కూడా తిండి ఉండేది కాదు.

కానీ, తన కుమార్తెలను ఉన్నత స్థితిలో చూడాలని కలగన్నారు. తండ్రి కష్టాన్ని గ్రహించిన పిల్లలు కూడా అంతే పట్టుదలతో చదివారు. మొదటి కుమార్తె  కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యింది. ఆమె మిగతా ఆరుగురికి మార్గదర్శిగా నిలిచింది. రెండో అమ్మాయి రాణి వివాహమైన తర్వాత 2009లో బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ఆ తర్వాత మిగతా ఐదుగురు పోలీస్, పారా మిలటరీ దళాల్లో చేరిపోయారు. ఏ కోచింగ్ లేకుండానే ప్రభుత్వ స్కూల్‌లో చదువుతూ, పొలాల్లో పని చేస్తూనే రన్నింగ్ ప్రాక్టీస్ చేసి డిఫెన్స్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యారు.