calender_icon.png 30 December, 2025 | 4:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీరో అవర్‌లో పలువురు ప్రజా ప్రతినిధులు...

30-12-2025 01:13:05 AM

భాష మార్చుకోవాలి: ఎమ్మెల్యే కాటేపల్లి 

అసెంబ్లీలో నేతలు మాట్లాడుతున్న తీరుపై బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సభ్యులు మీడియా ముందు ముందుగానీ, అసెంబ్లీలో గానీ తమ భాషను మార్చుకోవాలి. కొత్తగా అసెంబ్లీకి వచ్చిన వారికి సీనియర్లు స్ఫూర్తిగా నిలవాలి. మేము మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలుగా సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. సభ్యులు హుందాగా ప్రవర్తించాలి. సభలోని మూర్ఖులను సద్విమర్శతో మార్చాలి కానీ దిగజారి పోకూడదు.

సీఎం, ప్రతిపక్ష నేత, పీఎం స్థాయి వ్యక్తులను కూడా మీడియాలో ఏకవచనంతో మాట్లాడటానికి మనమే కారణం. హైదరాబాద్ వరల్డ్ క్లాస్ అని ప్రభుత్వం అంటుంది, కానీ మాటలు మాత్రం థర్డ్ క్లాస్‌లా ఉంటున్నాయి. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రస్తావించిన అంశంలో పూర్తిగా మద్దతు ఇస్తాం. ఇందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం కలిసి రావాలి. మాకు ఏ పార్టీ నేతలతో కక్షలు లేవు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాల్లు దొర్లితే సానుకూలంగా తీసుకుంటాం. బీజేపీ సీనియర్ నాయకులకు కూడా మర్యాదగా మాట్లాడాలి’?

తిరుమలలో తెలంగాణ భవన్ కట్టాలి: గంగుల 

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులకు వసతికి తీవ్రంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తిరుమలలోనూ తెలంగాణ భవన్ నిర్మించాలి. కర్ణాటక భవన్, తమిళనాడు భవన్ తరహాలోనే తెలంగాణ భవన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు శబరిమలలోనూ బీఆర్‌ఎస్ హయాంలో 5 ఎకరాలు కేటాయించామని, అక్కడ కూడా తెలంగాణ భవన్ నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. 

ఆస్పత్రికి 5 కోట్లు ఇవ్వండి: వేముల ప్రశాంత్‌రెడ్డి

బాల్కొండ్ నియోజకవర్గంలోని భీంగల్ మండలంలో బీఆర్‌ఎస్ హయాంలో 100 పడకల ఆస్పత్రి మంజూరు చేశాం. 80 శాతం పనులు కూడా పూర్తి అయ్యాయి. స్టాఫ్ అలాట్‌మెంట్ కూడా పూర్తి అయింది. నిర్మాణానికి రూ.35 కోట్లు మంజూరు చేయగా, రూ. 30 కోట్లు మా ప్రభుత్వ హయాంలోనే ఖర్చు చేశాం. కేవలం రూ.5 కోట్లు విడుదల చేస్తే ఆ ఆస్పత్రి పనులు పూర్తి అవుతాయి. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. 

ఆలేర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి: విప్ బీర్ల 

ఆలేర్ నియోజకవర్గంలోని కీలక మండలమైన ఆలేర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలి. ప్రజల చిరకాల కోరిక రఘునాథపురం మండలంగా ఏర్పాటు చేయాలి. నూతన మండలం ఏర్పాటుతో పాటు రాజపేట మండలంలోని మల్లగూడెం, బూరుగుపల్లి, కొండేటిచెరువు, పిట్టలగూడెం తదితర ఆవాస ప్రాంతాల్లో నూతన రేషన్ షాపులు మంజూరు చేయాలి. ప్రభుత్వం వెంటనే నూతన మండల ఏర్పాటు చేసి నూతన రేషన్ డీలర్ షాపులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సింగరేణి కార్మికుల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే కూనంనేని 

తెలంగాణలో ఏకైక, అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. అయినా సింగరేణి కార్మికుల్లో పూర్తిగా అసంతృప్తి చోటు చేసుకుంది. వీటిని పరిష్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి. లేదంటే సింగరేణి పూర్తిగా కనుమరుగయ్యి, ప్రయివేటు పరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మెడికల్ అన్ ఫిట్‌ను సరైన పద్దతిలో అమలు చేయడం లేదు, కారుణ్య నియామకాలకు వయస్సు 35 నుంచి 45కు పెంచినప్పటికీ, వివిధ కారణాలు చూపి నియామకాలు చేయడం లేదు. కార్మికులకు సొంత ఇంటి పథకం లేదని, కొత్త గనులను సింగరేణి దక్కించుకొని అందులో సింగరేణి కార్మికులను మాత్రమే నియమించుకోవాలి. 

మేడిగడ్డ పిల్లర్లను బాంబులతో పేల్చారు: పాడి 

హుజురాబాద్ నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్టు 2023లో కొట్టుకుపోయింది. ఆ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.70 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసింది. అది పూర్తి అయితే 6 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దానిని ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలి. మేడిగడ్డ బరాజ్ పిల్లర్లను బాంబులతో పేల్చినట్టుగానే కరీంనగర్‌లోని తణుగుల చెక్‌డ్యామ్‌ను బాంబులతో పేల్చారు. ఈ అంశంపై వెంటనే విచారణ జరపాలి. కాగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగగా.. ఇక్కడ కూర్చొని చెప్పడం కాదు, ఘటనా స్థలానికి వెళ్దాం పదండి అంటూ కౌశిక్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. 

యూరియా పంపిణీకి యాప్ ఎందుకు: కొత్త

అక్షరం ముక్క రాని రైతుకు స్మార్ట్ ఫోన్‌లో యూరియా యాప్ వాడటం ఎలా తెలుస్తుంది. తక్షణమే ఆ పద్ధతి తొలగించాలి. అలాగే వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు యాసంగి నాట్ల సమయంలోనే సరిగా కరెంట్ ఇవ్వకపోతే ఇక తర్వాత పంట చేతికి దశకి పంటలు ఎండిపోయే పరిస్థితి తెచ్చేలా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టిన జలాశయాలకు సంబంధించిన కాలువల్లో పూడికలు తీయడం లేదు, మరమ్మతులు గాలికి వదిలేశారు. 

గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక శాఖ: ఏలేటి 

గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి. గల్ఫ్‌లో కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. అలాగే మన ఊరు బడి పథకానికి నిధులు రావడం లేదు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదు. పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలి. జీహెచ్‌ఎంసీ పునర్విభజనలో కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం మళ్లీ పరిశీలించాలి. 

జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి చేస్తా: నవీన్‌యాదవ్

నాకు అవకాశం ఇచ్చి గెలిపించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు. గత రెండేళ్ల క్రితం అసెంబ్లీలో సీఎం తన పేరును ప్రస్తావించారు. రెండేళ్లలోపే తోటి సభ్యుడిగా సభలో రావడం గౌరవంగా భావిస్తున్నాను. సీఎం రేవంత్‌రెడ్డి సూచన, సలహాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కృషి చేస్తాను. సభ మర్యాదలను పాటిస్తూ, సభను గౌరవిస్తూ ముందుకు సాగుతాను.

వర్షంతో కృష్ణానగర్ మునిగిపోతుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లో హై టెన్షన్ లైన్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తన ప్రాంతంలో ఇంటర్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలి.