24-09-2025 12:00:00 AM
రెబ్బెన, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): సింగరేణి బొగ్గు సంస్థ ద్వారా ప్రకటించిన లాభాల్లో అర్హులైన లారీ డ్రైవర్లు, క్లీనర్లకు రూ.5,500 లాభాల వాటా వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన డ్రైవర్లతో కలిసి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ గతంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా అనేక మంది అర్హులు లాభాల్లో వాటా నుండి విరమించబడిన విషయాన్ని గుర్తు చేశారు.
కార్మికులు ఆర్థికంగా నష్టపోయారన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొన సాగితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టే తప్పదన్నారు. ఒక్కరికి కూడా అన్యాయం జరగ కూడదని అర్హులైన ప్రతి డ్రైవర్కు, క్లీనర్కు లాభాల్లో వాటా తప్పనిసరిగా అందాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు లచ్చన్న, కార్యదర్శి తిరుపతి, ఇతర నాయకులు నర్సయ్య, శంకర్, మనోహర్, రవి, గంగారాం, సతీష్, చంద్రకాంత్, బుచ్చన్న, రమేష్, లింగాన్న, ప్రభాకర్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.