calender_icon.png 12 September, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల స్కామ్ ఈడీ దూకుడు

12-09-2025 01:01:14 AM

విచారణకు హాజరుకావాలని బాధితులకు నోటీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసిం ది. ఈ కేసులో కీలక నిందితుడైన మొయినుద్దీన్, అతని గ్యాంగ్ చేతిలో మోస పోయిన బాధితులకు నోటీసులు జారీచేసింది. ఈనెల 15న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై తొలుత అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేసేందుకు ఈడీ రంగంలోకి దిగింది. నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు బదిలీలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈడీ ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, అతని అనుచరులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతుల నుంచి గొర్రెలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా సుమారు రూ. 2 కోట్లు మోసం చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైనా కూడా కేసులు నమోదు అయ్యాయి. కోట్లలో అక్రమాలు జరిగాయనే కోణంలో అవినీతి నిరోధకశాఖ ప్రారంభించిన దర్యాప్తులోనే సుమారు రూ. 700 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ప్రాథమికంగా తేలగా ఆ విచారణ ఆధారంగా ఈ కేసులోకి ఈడీ ఎంటరైంది.

ఈక్రమంలో ఈ గొర్రెల స్కామ్‌లో రూ.1,000 కోట్లకుపైగా దారి మళ్లి ఉంటాయనే ఈడీ అంచనాకు వచ్చింది. రైతులకు చెల్లించాల్సిన ప్రభుత్వ నిధులను కొందరు ప్రభుత్వ అధికారుల అండతో మొయినుద్దీన్ తన బినామీ ఖాతాలకు, సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో, బాధితులైన రైతుల నుంచి వంగ్మూలాలు నమోదుచేసి, కుంభకోణం యొక్క పూర్తి స్వరూపాన్ని వెలికితీయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.