calender_icon.png 22 November, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వణికించిన వాన

17-08-2024 02:50:59 AM

  1. జలమయమైన రహదారులు 
  2. మరో రెండు రోజుల పాటు వర్షాలు 
  3. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ 

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 16 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని శుక్రవారం వర్షం ముంచెత్తింది. దీంతో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు రోడ్లపైకి వచ్చింది. నగరంలో మరో రెండు రోజుల పాటు వర్షా లు కురిసే అవకాశం ఉండడంతో వాతావర ణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, బేగంపేట్, సికింద్రాబాద్, బాలానగర్, కోఠి, అబిడ్స్, హైటెక్‌సిటీ, బయోడైవర్సిటీ, పటాన్‌చెరువు, రామచంద్రాపురం, మేడ్చల్, కండ్లకోయ, మియాపూర్, లింగంపల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు బారులుతీరాయి.

వర్షాలతో జీహెచ్‌ఎంసీ, జలమండ లి అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితులలో తప్పా బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ మేయర్, కమిషనర్ సూచించారు. అత్యవసర సమయాల్లో సహాయం కోసం 040 1111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించారు. శుక్రవారం రాత్రి పటాన్‌చెరువు ఎమ్మార్వో కార్యాలయం వద్ద అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయం పరిధిలో 2.2 సెంటీమీటర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  

జిల్లాల్లో..

మెదక్: భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై ఉన్న వాహనాలు సైతం నీటమునిగాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాల్లో భారీ వర్షం కురిసింది. కామారెడ్డిలోని నిజాంసాగర్ రోడ్డు లో సుమారు అర కిలోమీటరు మేర వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలువురి ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. 

నిర్మల్: నిర్మల్ పట్టణంలో పాటు జిల్లాలోని వివిధ మండలాల్లో ఏకధాటిగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.