05-05-2025 08:11:30 PM
మందమర్రి (విజయక్రాంతి): ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను పురస్కరించుకొని హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారమైన శ్రమశక్తి అవార్డును అందుకున్న ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, సింగరేణి కోల్ మెన్స్ లేబర్ యూనియన్(ఐఎన్టియుసి) కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంశెట్టి నరేందర్ కు ఆదివారం రాత్రి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా యూనియన్ సెక్రటరీ జనరల్, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్, బీనాదేవి లు హాజరై, నరేందర్ ను అభినందించారు.
ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... అతి చిన్న వయస్సులోనే నరేందర్ కు శ్రమశక్తి అవార్డు లభించిందని, అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో పని చేసే నాయకులకు యూనియన్ లో తప్పక గుర్తింపు ఉంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని తెలిపారు. యూనియన్ లో సైతం కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు లభించేలా కృషి చేస్తామన్నారు. రానున్న నాలుగు సంవత్సరాలలో ఏరియాలో కొత్త గనులు తీసుకురావడానికి, కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి యూనియన్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి యాజమాన్యం సొంతంగా ఐటీ కంపెనీ స్థాపించి, సింగరేణిలో పనిచేస్తున్న వందల మంది బీటెక్, ఇతర ఉన్నత చదువుకున్న వారికి ఐటి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించి, సింగరేణిని ఐటి హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
అదేవిధంగా సిమెంట్ కంపెనీని సైతం స్థాపించి, సొంతంగా సిమెంట్ ఉత్పత్తిని సింగరేణి యాజమాన్యమే చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమిష్టిగా పని చేస్తే విజయం మనదే అని, తిరుగులేని శక్తిగా ఐఎన్టీయూసీ ఎదుగుతుందన్నారు. భారీ గాలి వానలో సైతం ముక్కోవని పట్టుదలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషంగా ఉందని, ఇదే స్ఫూర్తితో యూనియన్ శ్రేణులు పనిచేసి, సింగరేణిలో ఐఎన్టీయూసీ జెండాను ఎగిరేల కృషి చేయాలని కోరారు. అనంతరం అవార్డు గ్రహీత రాంశెట్టి నరేందర్ మాట్లాడుతూ, ఏరియాలోని ప్రతి ఒక్క ఐఎన్టీయూసీ కార్యకర్తకు లభించినట్లేనని, తనను గుర్తించి, తనకు ఇంతటి గొప్ప ప్రతిష్టాత్మకమైన అవార్డును రావడానికి కృషి చేసిన యూనియన్ నేత జనక్ ప్రసాద్ కు సర్వదా రుణపడి ఉంటానన్నారు.
తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, యూనియన్ బలోపేతానికి, కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకై తనవంతు పాత్ర కొనసాగిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య, జాయింట్ ప్రధాన కార్యదర్శి మిట్ట సూర్యనారాయణ, కేంద్ర కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సంగ బుచ్చయ్య, బన్న లక్ష్మణ్ దాస్, మహిళా విభాగం కేంద్ర ఉపాధ్యక్షురాలు కల్పన, ఏరియా ఉపాధ్యక్షురాలు భాను, స్వాతి, ఏరియా కార్యదర్శులు దొరిశెట్టి చంద్రశేఖర్, బత్తుల వేణు, మండ భాస్కర్, అన్ని గనుల పిట్ కార్యదర్శులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.