09-08-2025 03:13:08 AM
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): అర్ధాంతరంగా నిలిచిన ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్ట్ ప నుల పునరుద్ధరణకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణకు పూనుకున్నట్టు రాష్ర్ట నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.
నీటిపారుదల రాష్ర్ట సలహాదారు ఆదిత్యాదాస్‌నాథ్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, రమేశ్‌బాబు, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, సీఈ అజయ్ కుమార్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు తూ.. ఎస్‌ఎల్బీసీ పనులను తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొంచినట్టు చెప్పారు.
అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంతో పాటు పాలనాపరమైన అనుమతులను పొందేందుకుగానూ త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సమావేశం కానున్నట్టు వెల్లడించారు. టన్నెల్ ప్రమాదం అనంతరం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను, సూచనల ను అనుసరించి పునరుద్ధరణ ప్రక్రియ మొద లు పెట్టబోతున్నట్టు చెప్పారు. శ్రీశైలం దిగువ భాగం నుంచి వచ్చే వరద కాలువ మిగిలిన 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి ఆటంకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫలితంగా ప్రతి సంవత్సరం ఆ నీటిని ఎత్తిపోసేందుకు కేవలం విద్యుత్ చార్జీలకే రూ.750 కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఎస్‌ఎల్బీసీ పునరుద్ధర ణలో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రో మాగ్నటిక్ సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. పర్వత భూభాగంలో ఉన్నందున హెలికాప్టర్ సర్వే తప్పని సరైందన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల ప్రారంభానికి ఈ సర్వే దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జీఎస్‌ఐని కూడా ఈ పనుల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. పునరుద్ధరణ పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు గానూ లీడార్ సర్వేనూ నిర్వహించబోతునట్టు ప్రకటించారు. అదే సమయంలో రాష్ర్ట మంత్రివర్గం ఆమోదం పొందిన అంచనా వ్యయాన్ని మించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగ వంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
నీటిపారుదల శాఖలో పదోన్నతులు..
మూడు దశాబ్దాల తర్వాత నీటిపారుదల శా ఖలో పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారిలో ఏఈఈల నుం చి సీఈల వరకు 47 మంది, అసిస్టెంట్ ఇంజినీర్ల నుంచి డిప్యూటీ ఇంజినీర్ల వరకు 127 మం ది, ఎస్‌ఈల నుంచి సీఈల వరకు 13 మంది ఉన్నారన్నారు. అన్ని విభాగాల సిబ్బందికి 33 ఏండ్ల తర్వాత స్కేల్‌తోపాటు పదోన్నతులను క్రమబద్ధీకరించామన్నారు. ఇందుకు ప్రతిభ, సీ నియారిటీలను ప్రాతిపదికను తీసుకున్నామని పేర్కొన్నారు.
ఇక నుంచి నీటిపారు దల శాఖ సిబ్బంది తమతమ బాధ్యతలపై పూ ర్తిస్థాయి లో దృష్టి సారించాలని ఉద్బోధించారు. పెం డింగ్‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూ ర్తి చేసే పనుల్లో నిమగ్నం కావాలని సిబ్బందిని ఆదేశించారు. సింగూర్ డ్యామ్‌ను పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వానాకాలం నే పథ్యంలో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న డ్యామ్‌లు, రిజర్వాయర్‌లతో పాటు ఇతర జలాశయాలను ని త్యం పర్యవేక్షించాలని, అధికారులు ఎల్లప్పు డూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమ్మక్క సారక్క బ్యారేజ్‌పై ఐఐటీ ఖరగ్ పూర్ నివేదిక
తెలంగాణలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్‌తోపాటు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుల బ్యాక్ వాటర్‌తో ఛత్తీస్‌గఢ్‌పై చూపే ప్రభావాల మీద ఐఐటీ ఖరగ్‌పూర్ జరిపిన అధ్యయన నివేదిక రాష్ర్ట ప్రభుత్వానికి చేరిందని, ములుగు జిల్లా ఏటూరునాగరం మండలంలోని తుపాకుల గూడెం గ్రామ సమీపంలో నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజ్ నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
బ్యారేజ్ నిర్మాణంతో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 40 హెక్టార్లు ముంపునకు గురవుతుందని నివేదికలో పేర్కొన్నట్టు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోటూర్, తార్లగూడ, గంగారాం, కంబల్‌పేటలతో 10.9 చ.కి.మీ. భూభాగం ముంపునకు గురవుతోందని అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. ఈ బ్యారేజ్‌ని పూర్తి చేసేందుకుగా నూ ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదించి అవసరమైన అనుమతులు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజె క్టు ద్వారా సుమారు 6.94 టీఎంసీల నీటితో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.