calender_icon.png 12 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీ కృషితో సజావుగా యూరియా పంపిణీ

12-09-2025 12:09:27 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ కృషితో జిల్లావ్యాప్తంగా యూరియా పంపిణీ సజావుగా సాగుతోంది. యూరియా బస్తాలకు ఇంటిల్లిపాది తరలి వస్తుండడంతో తోపులాటలు, రైతు వేదికల వద్ద రద్దీ పెరిగి అధికారులకు యూరియా పంపిణీ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దాదాపు 20 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉండడంతో పాటు ఇటీవల శాంతి భద్రతల సమస్యగా రూపాంతరం చెందింది.

ఈ క్రమంలో జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించి పగడ్బందీగా రైతులకు పంపిణీ చేయడానికి చర్యలు చేపట్టారు. పట్టా పాస్ పుస్తకం ఆధారంగా రైతు భరోసా ఆన్లైన్ ప్రకారం ఉన్న రైతులకు తొలుత క్రమ సంఖ్య ఆధారంగా యూరియా పంపిణీ చేపట్టాలని, రైతు వేదిక వద్ద రైతులకు టోకెన్లు జారీ చేసి, క్లస్టర్ వారిగా ఎక్కడికక్కడే అందుబాటులో ఉన్న సొసైటీ ఎరువుల విక్రయ కేంద్రం, ప్రైవేటు డీలర్ల వివరాలను సేకరించి అక్కడే టోకెన్ తీసుకువెళ్లి డబ్బులు చెల్లించి యూరియా తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు.

నాలుగు రోజుల నుండి స్వయంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, హార్టి కల్చర్ అధికారి మరియన్న, సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఇతర శాఖల జిల్లా అధికారులు ప్రతి మండలానికి ఒకరు చొప్పున ప్రత్యేక అధికారిగా బాధ్యత చేపట్టి యూరియా పంపిణీ వ్యవహారాన్ని పూర్తిగా ఒక కొలిక్కి తెచ్చారు.

ఫలితంగా మునుపటిలా కాకుండా రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. టోకెన్లు జారీ చేసే రైతు వేదిక వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసి క్రమపద్ధతిలో టోకెన్లు పొందేందుకు చర్యలు తీసుకున్నారు.  టోకెన్లు పొందిన రైతులు యూరియా ఎక్కడ తీసుకోవాలి, ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ముందస్తుగానే వారికి సమాచారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడంతో మహబూబాబాద్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు లేకుండా యూరియా పంపిణీ సజావుగా సాగుతోంది.

మొత్తంగా జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా యూరియా పంపిణీ కార్యక్రమానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు తానే స్వయంగా తెల్లవారింది మొదలు అర్ధరాత్రి వరకు మండలాలు, గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ పర్యవేక్షించడం విశేషం. పోలీస్ బాస్ నిరంతరం నాలుగు రోజుల నుండి నిద్రాహారాలు మా ని పంపిణీకే ప్రధమ ప్రాధా న్యం ఇవ్వడంతో ఇతర అధికారులు, కింది స్థాయి పోలీసులు కూడా అప్రమత్తమై యూరియా పంపిణీ భాగస్వాములవుతున్నారు.