19-05-2025 04:10:00 PM
వంద రోజుల్లో రైతుల బోరు మోటార్లకు సోలార్ విద్యుత్
అదానీ అంబానీలతో అడబిడ్డలు పోటీ..
ప్రపంచానికి అచ్చంపేట ఆదర్శం
మట్టి పిసికేటోళ్లకు పాలన చేతకాదంటూ ప్రతిపక్షాలు హేళన
పరాయి పార్టీ చేత మెప్పు పొందుతున్న పరిస్థితి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జల్, జమీన్, జంగల్, దున్నే వాడిదే భూమి నినాదంతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న ఆదివాసీలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల హక్కుల కోసం పోరాడుతుంటే వారి చేతులకు బేడీలు వేసి అవమానపరిచిన పరిస్థితి నుంచి ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలోని కాంగ్రెస్ అదే గిరిజన రైతుల పోడు భూములకు పెట్టాలివ్వడం పాటు భూమి పొరల్లోని నీటిని సాగు భూములుగా మార్చేందుకు ఇందిరా జల గిరి వికాసం పేరుతో సోలార్ విద్యుత్ ద్వారా పంటలు పండించుకునే వెసులుబాటు కల్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్లమల లోని అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ఇందిర సౌర జల గిరి వికాసం పథకాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర క్యాబినెట్ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అందుకు తగినట్లుగా అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని గుర్తు చేశారు. ఒక మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం బాగుపడుతుందని అలాంటిది రాష్ట్రంలోని కోటి మంది మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులుగా మారితే రాష్ట్రం సుభిక్షంగా మారుతోందని అదానీ, అంబానీలతో పోటీపడే స్థాయికి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ప్రోత్సాహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మాచారం గ్రామంలో 12,600 కోట్ల నిధులతో సుమారు 50 ఎకరాలకు పైగా గిరిజన భూముల్లో పళ్ళతోటలు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సోలార్ పంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ అచ్చంపేట ప్రాంతాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పాలమూరు వాసులకు మట్టి పిస్కడమే తట్టాపార మాత్రమే తెలుసునని అలాంటివారికి పాలించడం చేతకాదంటూ ప్రతిపక్షాలు హేళన చేస్తున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన గత ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో మింగుడు పడడం లేదని అందుకే వారు పెంచి పోషించే సోషల్ మీడియాను వాడుకొని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మట్టి పిసికేటోళ్లకు పాలించడం చేతకాదంటూ హేళన చేస్తున్న వారికి ప్రస్తుతం పరాయి పార్టీ ఐన కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
అచ్చంపేట నియోజకవర్గం లోని మాచారం గ్రామంలో ప్రారంభించిన ఇందిర సౌర జల గిరి వికాసం కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా మాత్రమే ప్రారంభించడం జరిగిందని ఇదే మాదిరి రాష్ట్రంలోని అన్ని విద్యుత్ మోటార్ల వద్ద సౌర విద్యుత్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సౌర విద్యుత్తు ఉత్పత్తి ద్వారా మహిళల నుండే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా పథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఆశించిన విధంగానే పరిపాలన కొనసాగిస్తుందని ప్రజలు కూడా పసిబిడ్డను కాపాడుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. కష్టమంటే తెలిసిన వ్యక్తిని కాబట్టే పేదల కష్టాన్ని అర్థం చేసుకొని సహచర క్యాబినెట్ మంత్రుల సంపూర్ణ సహకారంతోనే పరిపాలన విజయవంతంగా సాగిస్తున్నట్లు తెలిపారు