02-10-2025 12:00:00 AM
ఆటపాటలతో సంబరాలు చేసుకున్న ఆడపడుచులు
గజ్వేల్, అక్టోబర్ 1: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం మంగళ స్నానాలు ఆచరించి గౌరమ్మను పూజించి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా భా రీ స్థాయిలో తయారు చేశారు. సాయంత్రం 4 గంటల నుండి మహిళలు అందంగా ముస్తాబై భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను తీసుకువచ్చి ప్రధాన క్రీడలలో చెరువుగట్లపై ఆడారు.
ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు బతుకమ్మ ఆటకు అనుముగా చెరువు కట్టలను పరిసర ప్రాంతాలను తీర్చిదిద్దారు. గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పాండవుల చెరువు, ముట్రాజ్ పల్లి బర్రి చెరువు వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయగా, గజ్వేల్ ఏసిపి నర్సింలు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
సాయంత్రం 4 గంటలకు మొదలుకొని రాత్రి 8 గంటల వరకు బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగాయి. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎన్సీ రాజమౌళి, గాడి పల్లి భాస్కర్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సి సంతోష్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.