23-08-2025 02:23:15 PM
సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
చండూరు/గట్టుప్పల (విజయక్రాంతి): స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం(CPM District Secretary Group Member Banda Srisailam) అన్నారు. గట్టుప్పల మండల పరిధిలోని తేరటుపల్లి గ్రామంలో సిపిఎం బృందం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కండేయ కాలనీలో సీసీ రోడ్లు, మురికి కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. తేరటుపల్లి నుండి షేరిగూడెం, వెల్మకన్నె ఈ గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మించాలని, చండూరు ప్రధాన రహదారి రోడ్డు నుండి స్కూల్ వరకు మురికి కాల్వ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాల సీజన్లో రైతులు ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ముందస్తు ప్రణాళికలను రూపొందించి అందుకు తగిన విధంగా కావలసిన సౌకర్యాలను సిద్ధం చేసుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అది విస్మరించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయే తప్ప చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కారం చేయడంలేదని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధానంగా యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని అవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో దోమలు, ఈగలు ఇంట్లోకి ప్రవేశించడం వలన ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని,గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అచ్చిన శ్రీనివాసులు, పగిళ్ల శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, కట్ట యాదగిరి, వల్లూరి జంగయ్య, అచ్చిన బీరప్ప, పబ్బు లింగస్వామి, జోగు మల్లయ్య, గిరి బిక్షం, పోలోజు సక్కుబాయి, గిరి సువర్ణ, మాజీ వార్డ్ మెంబర్ వల్లూరి కొండమ్మ, పోలోజు రవీంద్ర చారి, బండ ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.