30-10-2025 01:05:01 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,అక్టోబర్ 29(విజ యక్రాంతి): జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నా రు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఎ. ఎస్.పి. చిత్తరంజన్, ఆర్డిఓ అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా, ఆర్. టి. సి., వైద్య శాఖల అధికారులు, జాతీయ రహదారుల సంస్థ అధికారులతో రహదారి ప్రమాదాల నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారులపై ప్రమాదాలు నియంత్రించేందుకు అవసరమైన సూచికలు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలు ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి రక్షణ పరమైన సూచిక బోర్డులు, వేగ నియంత్రణ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయా లని, ప్రతి వాహన చోదకుడు హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని, జాతీయ రహదారిపై వేగ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్న గ్రామాలలో సర్వీసు రహదారులకు వేగ నియంత్రికలను ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతీయ రహదారిపై ప్రతి 5 కిలోమీటర్లకు వేగ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాలు జరిగిన వెంటనే జతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్లను జాతీయ రహదారుల సంస్థ అధికారులు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
పంచాయితీ రాజ్, రోడ్లు భవనాల శాఖలు తమ పరిధిలోని రహదారులపై గుంతలను వెంటనే పూడ్చాలని, కల్వర్టులు, వంతెనల మరమ్మత్తులు పనులు పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో రహదారులు ఆక్రమణ జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, మున్సిపాలిటీలలో రద్దీగా ఉండే ప్రాంతాలలో రహదారి భద్రతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, వేగ నియంత్రణ కొరకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఆర్.టి.సి. బస్సులు, విద్యాసంస్థల బస్సులు కండిషన్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి రామ్ చందర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ లక్ష్మీనారాయణ, రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.