30-10-2025 01:04:12 AM
ముగ్గురు సభ్యులకు రివార్డు నగదు అందజేత
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 29, (విజయక్రాంతి):నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పని చేస్తూ ఇటీవల జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన ముగ్గురు సభ్యులకు బుధవారం రూ 9.50 లక్షల నగదును చెక్కుల రూపంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో చెక్కుల రూపంలో అందజేశారు. రివార్డు నగదు పొందిన సభ్యుల వివరాలు 1. చత్తీస్గడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా, దేవ్ గావ్ గ్రామానికి చెందిన రామ్ సింగ్ కౌడే @ నరోటి మనీష్ @ లోకేష్ @ ఆకాష్ కు రూ 5,లక్షలు ,2. బీజాపూర్ జిల్లా రాంపూర్ గ్రామం కు చెందిన ముచ్చికి సోందాల్ @ నరేష్ రూ 3.75 లక్షలు, 3. చత్తీస్గడ్ రాష్ట్రం, సుఖమా జిల్లా, దులేడ్ గ్రామానికి చెందిన సోడి భీమే, ౄ/o.దేవాకు రూ 75 వేలు చెక్కు రూపంలో అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి మంజూరైన రివార్డు నగదులను వారి పునరావాసం కోసం అందజేయడం జరిగిందన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ నాయకులు అమాయకులైన ఆదివాసీలను బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకుని వారి చేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయించారని తెలిపారు. లొంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.
నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మిగిలిన నాయకులు, సభ్యులు ఆయుధాలను వీడి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల హక్కుల తరుపున పోరాడాలని కోరారు. లొంగిపోయి సాధారణ జీవనం గడపాలను కునేవారు తమ బంధుమిత్రుల ద్వారా , స్థానిక పోలీస్ అధికారుల ద్వారా, స్వయంగా జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా పోలీస్ శాఖ తరపున చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, ఆర్‌ఐ ఆపరేషన్స్ రవి లు పాల్గొన్నారు.