10-01-2026 12:00:00 AM
ములుగు, జనవరి 9 (విజయక్రాంతి): ములుగు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో,లయన్స్ క్లబ్ సహకారంతో రోడ్ సేఫ్టీ కార్యక్రమం ములుగు జిల్లా డీటీఓ కార్యాలయంలో శుక్రవారం రోజు ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ఈఐబీ,ఆటో,టాటా మ్యాజిక్,లారీ డ్రైవర్లకు నిపుణ వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి,అవసరమైన వారికి కంటి చుక్కలు,మందులు అందజేశారు.
వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి ఆరోగ్యం ఎంతో కీలకమైనదని,రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆర్టిఓ శ్రీనివాస్ అధికారులుఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు రోడ్డు దాటే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యత,పాదచారుల భద్రత వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రత అనేది డ్రైవర్లకే కాకుండా పాదచారులు, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరి బాధ్యత అని,చిన్న వయసు నుంచే రోడ్డు నియమాలపై అవగాహన కల్పిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తామని పేర్కొన్నారు.