14-09-2025 07:34:39 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): 2025-2026 విద్యాసంవత్సరానికి గాను మంచిర్యాలలోని కాలేజ్ రోడ్ లో గల మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల (పురుషుల) డిగ్రీ కళాశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ లు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ఆర్ సీ వో సేరు శ్రీధర్ ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు వివిధ కోర్సులలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని, విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఉచిత భోజనం, హాస్టల్ వసతితో పాటు, యూనిఫామ్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్స్, షూస్, ట్రాక్ షూట్, బెడ్ షీట్స్ అందజేస్తామని తెలిపారు.
విద్యార్థుల సౌకర్యార్థం వసతులు...
విద్యార్థుల సౌకర్యార్థం అధునాతన సౌకర్యాలతో తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం ఉందని, నిపుణులైన అధ్యాపకులతో విద్యా బోధన, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ 4, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ, ఎస్ ఎస్ సీ, ఎస్సై, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేకమైన కోచింగ్ అందజేస్తున్నారు. కెరియర్ గైడెన్స్ కోసం టాస్క్ వంటి సంస్థల సహకారంతో బోధన తరగతులు, ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొనడం, వారాంతంలో వినోద కార్యక్రమాల వీక్షణం, హెల్త్ సూపర్ వైజర్ పర్యవేక్షణలో ప్రతిరోజు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, 24 గంటల అధ్యాపకుల పర్యవేక్షణలో విద్యార్థులు, వివిధ కోర్సుల అకాడమిక్ పుస్తకాలతో పాటు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన లైబ్రరీ సదుపాయం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో విద్యార్థులను తీర్చిదిద్దడం వంటి సదుపాయాలు కల్పించామన్నారు. మరింత సమాచారం కోసం 96037 05803, 91373 81807 నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.